Posetti
-
ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని.. కిరాతకంగా చంపిన తనయుడు..
సాక్షి, నిజామాబాద్: కుటుంబ పరంగా రావాల్సిన డబ్బులు ఇవ్వ కుండా తాత్సారం చేస్తున్నాడనే కోపంతో ఓ కసాయి తనయుడు తండ్రిని చున్నీతో ఉరిబిగించి హత్య చేసిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ జయేశ్‌రెడ్డి, ఎస్సై నీరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జవహార్‌నగర్ కాలనీకి చెందిన నక్క చిన్న పోశెట్టి(56) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో కుమారుడు సాయిలు తండ్రి చిన్న పోశెట్టిల మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాడనే కోపంతో ఇంట్లో ఒక్కడే నిద్రిస్తున్న తండ్రిని చున్నీతో ఉరిబిగించి హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి స్థానికంగా ఉన్న వారికి హత్య చేసినట్లు తెలుపగా మద్యం మత్తులో చెబుతున్నాడని వారు పట్టించుకోలేదు. సాయిలు పోలీసుల ఎదుట తన తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకొని ఆదివారం లొంగిపోయాడు. సీఐ జయేశ్‌రెడ్డి, ఎస్సై నీరేశ్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణలో సాయిలు మద్యానికి బానిసయ్యాడని తెలిపారు. కుటుంబ, పొలం పరంగా రావాల్సిన డబ్బుల విషయమై పలుమార్లు తండ్రీకుమారుడిల మధ్య గొడవలు జరిగాయని చెప్పారు. సాయిలు మద్యానికి బానిస కావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇవి కూడా చదవండి: అమెరికాలో వైద్య విద్యార్థిని మృతి -
ముగ్గురు రైతుల బలవన్మరణం
సాక్షి నెట్వర్క్: రాష్ర్టంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన రైతు ఎడ్డెడి పోశెట్టి(55) తనకున్న ఎకరంతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొన్నాడు. అప్పు చేసి ట్రాక్టర్ కూడా కొన్నాడు. అయితే ఈసారి సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. దీంతో మార్కెట్ గోదాంలో వాచ్‌మన్‌గా చేరాడు. కాగా, గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పోశెట్టి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం మృతదేహం కనిపించింది. అప్పుల బాధతోనే పోశెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేటకు చెందిన రైతు రాసిక చినమల్లయ్య (55) తనకున్న ఐదున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాలు లేక పత్తి చేను వాడిపోయింది. దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డికి చెందిన కుర్వ బజారి గోపాల్(30)తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి, వేరుశనగ సాగు చేశాడు. వీటి కోసం రూ. లక్షకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చలేనేమోనని మనస్తాపానికి గురై ఆదివారం ఉరేసుకున్నాడు. పంట ఎండిందని గుండెపోటు మాచారెడ్డి: పంట ఎండిందనే బెంగతో ఆదివారం నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం అంకాపూర్‌లో గుండెల్లి లింగయ్య(55) అనే రైతు గుండెనొప్పితో కుప్పకూలాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కెనాల్లోపడి రైతు మృతి ధర్మసాగర్: గెదే తోక పట్టుకొని కాలువ దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు అందులో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా ఎలుకుర్తిలో ఆదివారం జరిగింది. గుండవరపు వెంకట్రావు(65) ఆదివారం వ్యవసాయ బావికి వెళ్తున్న క్రమంలో కాలువను దాటేందుకు గెదే తోకను పట్టుకున్నాడు. ఈ క్రమంలో నీటిప్రవాహధాటికి పట్టుతప్పడంతో నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు.