
పొట్టకూటి కోసం వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
ముకుందాపురం,(మునగాల) :రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు వారివి. పొట్టకూటి కోసం నాలుగు రాళ్లు సంపాదించుకుందామనే ఉద్దేశంతో వెళుతున్న వారిని మార్గమధ్యలో లారీరూపంలో మృత్యువు కబళించింది.పెద్దదిక్కు కోల్పోయి మూడు కుటుంబాలు వీధినపడ్డాయి.
అతివేగమే ప్రమాదానికి కారణం
65వ నంబరు జాతీయ రహదారిపై మునగాల మం డలం ముకుందాపురం శివారులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగం,నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మం డ లం రాయిగూడెం నుంచి మెదక్ జిల్లా సిద్దిపేటకు పా తపెంకుల లోడుతో లారీ వెళ్ల వలిసి ఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో డ్రైవర్ షేక్‌వలీ గ్రా మంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాడు. రాత్రి పదిం టికి ఇంటి నుంచి బయలుదేరిన రెండు గం టలలోపే ప్రమాదం జరిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు.
మృతులంతా దినసరి కూలీలే
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన దొప్పా కుమారి(48),తోట కొండలు(47), ఏ.శ్రీను(28), గాయపడిన లింగం అప్పారావు, లింగయ్య దినసరి కూలీలే. వీరంతా ఖమ్మం జి ల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడేనికి చెందిన వారు. వీరు గ్రామాల్లో బెంగళూరు పెంకను సేకరించే కూలీలుగా పనిచేస్తున్నారు.
మిన్నంటిన ఆర్తనాదాలు
అతివేగంతో వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాకొట్టింది.పెంకులపై భాగంలో ఉన్న తోట ఏడుకొండలు,ఆకం శ్రీనుపై పెంకలు పడడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. క్యాబిన్‌లో కూర్చున్న దొప్పా కుమారి, లింగం అప్పారావు, లింగయ్య అం దులోనే ఇరుక్కుపోయారు. తమను రక్షించాలని చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి.
అప్రమత్తమైన పోలీసులు
హైవేపై ప్రమాదం విషయం తెలుసుకుని మునగాల స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ డి.రామకృష్ణారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురిని చాకచక్యంగా బయటకు తీశారు. అనంతరం జేసీబీ సాయంతో పెంకుల లోడు కింద ఉన్న మరో ఇద్దరిని వెలికి తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం 108వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా దోప్పా కుమారి మృతిచెందగా, అప్పారావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో లారీక్లీనర్ యూసఫ్‌కు స్వల్ప గాయాలు కాగా, డ్రైవర్ షేక్‌వలీ క్షేమంగా బయట పడ్డాడు.
పెద్దదిక్కు కోల్పోయిన బాధిత కుటుంబాలు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడడంతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. మృతురాలు దొప్పా కుమారి స్వగ్రామంలో చిన్న కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తోంది. భర్త ఇంతకు ముందే మృతిచెందగా కుమారుడు రెండేళ్ల క్రితం మరణించాడు. ఈమెకు ఒక కుమార్తె. ఇదే గ్రామానికి చెందిన తోట కొండలు(47) వ్యవసాయ కూలీ. ఇతడికి భార్య నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మరో మృతుడు ఆకం శ్రీను(28)కు భార్య, పదేళ్లలోపు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈయనది రెక్కాడితే డొక్కాడని కుటుంబమే.