
తిరుమలగిరి స్టేట్‌బ్యాంకులో దోపిడీ యత్నం
- రూ.కోటి నగదు క్షేమం
- స్థానికంగా కలకలం
బొల్లారం, న్యూస్‌లైన్: తిరుమలగిరి స్టేట్‌బ్యాంకులో దోపిడీ యత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు చేసిన ఈ ప్రయత్నం పోలీసులు, బ్యాంక్ అధికారులను కలవరానికి గురి చేసింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి బ్యాంక్ అధికారులు బుధవారం తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలగిరి రాజీవ్ రహదారిపై ఉన్న ఎస్‌బీఐలో గుర్తుతెలియని దుండగులు భవనం వెనుక ఉన్న కిటికీ గ్రిల్స్‌ను తొలగించి లోనికి ప్రవేశించారు.
బ్యాంక్‌లోకి వెళ్లగానే మొదట విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం బ్యాంక్‌లో ఉన్న నాలుగు సీసీ కెమెరాల కనెక్షన్‌లను కట్ చేశారు. సీసీ కెమెరాలు చూపించిన సమయం ప్రకారం దుండగులు 6వ తేదీ (మంగళవారం) రాత్రి 11.30 గంటలు దాటిన తర్వాత బ్యాంక్‌లోకి వచ్చారని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో ఇద్దరు దుండగులు ప్రవేశించిన దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. ఆ తర్వాత దుండగులు లాకర్, స్ట్రాంగ్ రూమ్ వైపు వెళ్లినప్పటికీ అక్కడ వాటిని తెరిచేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా బ్యాంక్‌లోనే దాదాపు నాలుగు గంటల పాటు తిరిగినట్లు తేలింది.
ఆ సమయంలో సిగరెట్ తాగడంతో పాటు గుట్కాలు తిని బ్యాంక్‌లోనే ఎక్కడపడితే అక్కడ ఉమ్మేసిన మరకలు కనబడ్డాయి. ఈ నేపథ్యంలో దుండగులు బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించినప్పటికీ ధైర్యం సరిపోక తిరిగి వెళ్లిపోయారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి దుండుగులు ఎలాంటి చోరీ చేయకుండా వె ళ్లిపోవడంతో బ్యాంక్‌లో ఉన్న కోటి నగదు క్షేమంగా ఉంది. దీంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు.
రెండు నెలల కిందట ఇలాగే..
రెండు నెలల కిందట ఎస్‌బీఐకు కొద్ది దూరంలోనే ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దుండగులు దోపిడీ యత్నానికి పాల్పడ్డారు. అప్పట్లో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి జహీరాబాద్‌లో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీ చేసిన గ్యాంగ్ సభ్యులే ఈ ఘటనకూ పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. అయితే ఆ ఘటనలో సరైన ఆధారాలు దొరక్కపోవడంతో కేసులో పురోగతి కనిపించ లేదు.
ఆ గ్యాంగ్ సభ్యులేనా?
ముత్తూట్ సంస్థలో దోపిడీ యత్నానికి పాల్పడ్డ వారే ఎస్‌బీఐ దోపిడికి యత్నించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ పోలీసులకు అలాంటి ఆధారాలేవీ లభించలేదు. సీసీ కెమెరాల్లో లభించిన దృశ్యాలతో నిందితులను గుర్తించేందుకు పోలీ సులు ఫోరెన్సిక్ అధికారుల సహాయాన్ని తీసుకుంటున్నారు.