సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రమంగా బలహీనపడుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకం కోల్పోతోందని పేర్కొన్నారు. అమరుల స్ఫూర్తి యాత్ర కోసం 10 రోజుల క్రితమే అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆఖరు నిమిషంలో అరెస్టులకు పాల్పడ్డారన్నారు. అనుమతి కోసం వెళ్తే అరెస్టులు చేస్తారా.. అని నిలదీశారు. ప్రభుత్వం శనివారం 400 మంది జేఏసీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు.
ఆదివారం తన నివాసంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసుల అక్రమ అరెస్టుల నేపథ్యంలో జేఏసీ సంకల్పం మరింత బలపడింది. ప్రభుత్వ తీరును ప్రతిపక్ష పార్టీలన్నిటికీ వివరిస్తాం. గవర్నర్, రాష్ట్రపతికి కూడా ఇక్కడి పరిస్థితిపై ఫిర్యాదు చేస్తాం. న్యాయపోరాటానికి సైతం సిద్ధంగా ఉన్నాం.
అత్యాచారాలు, దొమ్మీల వంటి నేరాలకు వర్తింపజేసే సెక్షన్ 151 కింద జేఏసీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయం’’అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెం టనే వాటిని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నుంచి కొలువుల కోసం కొట్లాట మొదలవుతుందన్నారు. ఈ నెల 31న కొలువుల కొట్లాట కోసం బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నందున కోదండరాం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు.
రాష్ట్రంలో నియంతృత్వ పాలన: వీహెచ్
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని సీఎం అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఇప్పటికైనా ఈ వైఖరి మార్చుకోవాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. ఆదివారం ఆయన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బండ చంద్రారెడ్డితో కలసి వెళ్లి కోదండరాంను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment