జిల్లాలో అర్హతలేకుండా పింఛన్లు తీసుకుంటున్నది..
2,333 మంది వారి నుంచి రూ.2.81 కోట్ల వసూలుకు ఆదేశాలు
తొలుత సర్కారు ఉద్యోగుల సంబంధీకులకు చెక్
బుధవారంలోగా నోటీసులు.. 11తేదీలోగా రికవరీ
ఆసరాలో అనర్హులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు స్వీకరించిన సొమ్మును రికవరీ చేసేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తొలుత వారికి నోటీసులు జారీ చేసి, పక్షం రోజుల్లో డబ్బును రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్(ఎస్‌ఈఆర్‌పీ) ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో అనర్హులకు నోటీసుల జారీకి మండల యంత్రాంగం చర్యలు చేపట్టింది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
జిల్లాలో 2,93,732 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత కార్మికులున్నారు. పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు పెట్టింది. ఈ మేరకు ఎంపిక చేయాలని సూచించగా.. క్షేత్రస్థాయిలో తప్పుడు వివరాలు సమర్పించి కొందరు అర్హులుగా జాబితాలోకి ఎక్కారు. ఈ క్రమంలో వారంతా పింఛన్లు పొందుతున్నారు.
ఈ క్రమంలో అక్రమార్కులను ఏరివేసేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేపట్టింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఆధారపడ్డవారు కూడా పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించిన యంత్రాంగం.. వారిని జాబితా నుంచి తొలగించడమే కాకుండా ఇప్పటివరకు తీసుకున్న సొమ్మును రికవరీ చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇలా జిల్లాలో 2,333 మంది ఉన్నట్లు తేల్చిన యంత్రాంగం.. వారి నుంచి రూ.2,81,13,200 రికవరీ చేసి సెర్ప్ ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది. అనర్హులుగా గుర్తించిన వారికి ఈనెల రెండోతేదీలోగా నోటీసులిచ్చిన అనంతరం ఈనెల 11లోగా రికవరీ చేయాలని తేల్చిచెప్పింది.
ఇలా దొరికిపోయారు..
ఆసరా పథకం కింద పింఛన్లు తీసుకుంటున్న వారి ఆధార్ వివరాలను ప్రభుత్వం
ఇదివరకే ఆన్‌లైన్‌లో నమోదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు
అమలు చేస్తున్న ఆరోగ్య పథకంలోనూ వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను వెబ్‌సైట్లో నమోదు చేసింది. ఈక్రమంలో ఆసరా పథకంలోని లబ్ధిదారుల ఆధార్ వివరాలను, హెల్త్ కార్డుల డాటాబేస్‌లోని ఆధార్ వివరాలను సరిపోల్చగా 2333 మందికి సంబంధించి వివరాలు సరిపోలాయి. దీంతో ఆ మేరకు వారిని ప్రభుత్వ ఉద్యోగులపై ఆధారపడిన వారిగా నిర్ధారిస్తూ.. వారి పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగించారు. తాజాగా రికవరీకి ఉపక్రమించారు.
ఉద్యోగుల జీతాల్లోంచైనా..
జాబితాలో అనర్హులుగా గుర్తించిన వారికి సంబంధించి రికవరీ ప్రక్రియను ప్రభుత్వం కఠినతరం చేసింది. ముందుగా అనర్హులుగా గుర్తించినవారికి నోటీసులు జారీ చేసిన అనంతరం.. సొమ్ము రికవరీకి పది రోజుల గడువునిచ్చింది. నిర్దేశిత గడువులోగా డబ్బులు చెల్లించకుంటే వారికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి ఆ మేరకు నిధులు వెనక్కి రాబట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అన్ని కేటగిరీల్లోనూ ఏరివేత
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులపై ఆధారపడి ఉన్న వారిని అనర్హులుగా గుర్తించిన సర్కారు.. త్వరలో అన్ని కేటగిరీల్లోనూ అనర్హులను ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. ఆసరా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని అర్హతలున్నవారికే లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. నిబంధనలను అతిక్రమించిన వారిని జాబితా నుంచి తొలగించి రికవరీ చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.
అనర్హుల ఆసరా.. రికవరీ
Published Wed, Dec 2 2015 12:12 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement