నేడు సీఎం పర్యటన
- ఏర్పాట్లు పూర్తి
- ముందుగా నాచగిరి బ్రహ్మోత్సవాలకు కేసీఆర్
- తర్వాత గజ్వేల్ నగర పంచాయతీలో పర్యటన
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఇతర అధికారులు
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తుండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఈ మేరకు కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు, డీఐజీ తదితరులు బుధవారం గజ్వేల్‌లో పర్యటించారు. పిడిచెడ్ రోడ్డువైపున ఆయిల్ మిల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను కలెక్టర్ పరిశీలించారు. సీఎం సందర్శించనున్న ఆడిటోరియం, ఇంటిగ్రేటేడ్ ఆఫీస్ బిల్డింగ్ కోసం సేకరించనున్న పాల శీతలీకరణ కేంద్రం స్థలం, సంగాపూర్ రోడ్డు వైపున రైతు బజార్ కోసం సేకరించనున్న స్థలం, ఇందిరాపార్క్ తదితర ప్రదేశాలను కలెక్టర్ స్వయంగా చూశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీఎం నిర్వహించనున్న సమీక్ష సమావేశ స్థలాన్ని సైతం పరిశీలించారు.
నాచారం నుంచి ప్రారంభం..
కేసీఆర్ ముందుగా వర్గల్ మండలం నాచారంగుట్టకు చేరుకొని బ్రహోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి గజ్వేల్‌కు చేరుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం సేకరించనున్న స్థలాలను పరిశీలించి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నగర పంచాయతీ పాలక వర్గం, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు పట్టణంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగనుంది.
కలెక్టర్ సమీక్ష..
సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కమిషనర్ ఎన్.శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నగర పంచాయతీ సమీక్ష నిర్వహిస్తున్న వేళ... ఆయన దృష్టికి ఏయే అంశాలను తీసుకెళ్లాలనే అంశంపై స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ‘గడా’ ఓఎస్‌డీ, మున్సిపల్ శాఖ రీజినల్ డెరైక్టర్ శ్రీనివాస్‌రెడ్డిలు కమిషనర్ ఎన్.శంకర్, నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పాలకవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
నాచగిరిలో కలెక్టర్, ఎస్పీ...
వర్గల్: బ్రహ్మోత్సవాలకు సీఎం హాజరవుతున్న దృష్ట్యా బుధవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతి నాచగిరిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ఈఓ హేమంత్ కుమార్ కు సూచనలు చేశారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. హెలిపాడ్ స్థలాన్ని సందర్శించారు.