సాక్షి, హైదరాబాద్: గిరిజన వర్గాల కోసం రాష్ట్ర సర్కారు కొత్తగా తీసుకొచ్చిన గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్‌డీఎఫ్)పై ప్రభుత్వ శాఖల్లో గందరగోళం నెలకొంది. 2017–18 వార్షిక సంవత్సరం నుంచి బడ్జెట్ పద్దుల్లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో గిరిజన ప్రత్యేక ప్రణాళిక స్థానంలో గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధిని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 2017–18 సంవత్సరానికి రూ.8,165.87 కోట్లు కేటాయించింది. గిరిజన సంక్షేమం కోసం తలపెట్టిన ఈ ప్రత్యేక అభివృద్ధి నిధిని 43 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎస్‌డీఎఫ్ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుండగా... సంబంధిత శాఖలు ఖర్చులు మొదలుపెట్టాయి. అయితే గడిచిన ఆర్నెల్లలో ఏ శాఖ ఎంత మేర ఖర్చు పెట్టిందనే లెక్కల్లో స్పష్టత లేదు. శాఖల వారీగా లెక్కలు తేలకపోవడంతో ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చు, లబ్ధిపై అయోమయం నెలకొంది.
నివేదికల జాడలేదు..
ఎస్టీ ఎస్‌డీఎఫ్ కింద చేసే ఖర్చులు, లబ్ధిపై శాఖల వారీగా ప్రత్యేక ఖాతాలు నిర్వహించాలి. అలాగే ఆర్థిక శాఖ రూపొందించిన సీజీజీ పోర్టల్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి. కానీ గత ఆర్నెల్ల కాలంలో 43 శాఖల్లో ఒక్క విభాగం కూడా వివరాలు అప్‌లోడ్ చేయకపోవడం గమనార్హం. సాధారణంగా ఎస్‌డీఎఫ్ వినియోగంలో ప్రభుత్వ శాఖలు నాలుగు కేటగిరీల్లో నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత లబ్ధిదారులు, సంఘాలు, పనులు, వ్యవస్థాగత అభివృద్ధిపై స్పష్టమైన సమాచారాన్ని జిల్లాలు రూపొందించి నివేదికలను పొందుపర్చాలి. కానీ ఈ నివేదికల రూపకల్పనపై ఉన్నతాధికారులకు అవగాహన లేకపోవడంతో ఆన్‌లైన్‌లో ఇప్పటివరకు ఎలాంటి వివరాలు నమోదు కాలేదు. ఇటీవల సంక్షేమ భవన్‌లో గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుపై 43 శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమావేశంలోనూ ఆయా శాఖలు సరైన వివరాలు సమర్పించకపోవడంపై ఎస్‌డీఎఫ్ కార్యదర్శి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
సీఎస్ ప్రత్యేక సమావేశం
గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుపై సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 43 విభాగాలకు చెందిన కార్యదర్శులు, హెచ్‌ఓడీలు పాల్గొననున్నారు. గతవారం జరిగిన సమావేశంలో శాఖాధిపతుల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో సోమవారం నాటికల్లా స్పష్టమైన వివరాలతో రావాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో నేటి సమావేశం కీలకంగా మారింది.
‘లెక్క’లేనితనం!
Published Mon, Oct 16 2017 12:54 AM | Last Updated on Mon, Oct 16 2017 12:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment