
మాట్లాడుతున్న సజ్జాద్ నౌమానీ. చిత్రంలో ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి 3 రోజుల పాటు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ముస్లిం పర్సనల్ లా అధికార ప్రతినిధి సజ్జాద్ నౌమానీ తెలిపారు. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాల్లో పలు ముస్లిం ధార్మిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొంటారన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, బాబ్రీ మసీదు, షరియత్‌లో కేంద్రం జోక్యం అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. కాగా 16 ఏళ్ల అనంతరం ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాలకు హైదరాబాద్ నగరం వేదిక అయిందన్నారు. గతంలో 2002లో నగరంలో సమావేశం జరిగిందన్నారు.
సమావేశ వివరాలివీ...: కంచన్‌బాగ్ సాలార్ మిల్లెత్ ఆడిటోరియంలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని నౌమానీ చెప్పారు. తొలిరోజు మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ సభ్యుల సమావేశం, సాయంత్రం పలు రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం ఉంటుందన్నారు. రెండోరోజు ప్రతినిధుల చర్చలు ఉంటాయన్నారు. అదేరోజు ప్లీనరీ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తామన్నారు. చివరి రోజు సాయంత్రం దారుస్సలాంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో బోర్డు కార్యదర్శి మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహ్మానీ, మజ్లిస్ అధినేత, సమావేశాల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.