అమాత్యుల రాక నేడు | today state ministers, ktr,etela rajender arrival | Sakshi
Sakshi News home page

అమాత్యుల రాక నేడు

Published Tue, Jun 17 2014 4:02 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

అమాత్యుల రాక నేడు - Sakshi

అమాత్యుల రాక నేడు

- జిల్లాకు మంత్రులు ఈటెల, కేటీఆర్
- ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
- తెలంగాణ చౌక్‌లో బహిరంగ సభ, ధూంధాం

కరీంనగర్ : రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు మంగళవారం జిల్లాకు రానున్నారు. రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి జిల్లాకు వస్తున్న మంత్రులకు ఘనస్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు... మంత్రులు హైదరాబాద్ నుంచి బయల్దేరి మంగళవారం సాయంత్రం 4గంటలకు జిల్లా సరిహద్దులోని శనిగరం చేరుకుంటారు. అక్కడ హుస్నాబాద్, మానకొండూర్ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్  ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకువస్తారు. బెజ్జంకి క్రాసింగ్ వద్ద నుంచి భారీ బైక్‌ర్యాలీతో మంత్రులకు స్వాగతం పలుకనున్నారు.

అల్గునూరులోని పెద్దమ్మ దేవాలయంలో మంత్రులు పూజలు నిర్వహిస్తారు. అక్కడే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కరీంనగర్ నియోజకవర్గ సరిహద్దులోని మానేరు బ్రిడ్జి వద్ద స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో పార్టీ నేతలు మంత్రులకు ఘనస్వాగతం పలుకుతారు. అక్కడినుంచి భారీ ఊరేగింపుతో నగరంలోకి ప్రవేశించి మహాత్మా జ్యోతిరావుపూలే, మహాత్మగాంధీ విగ్రహాలకు, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.

సాయంత్రం నగరంలోని తెలంగాణ చౌక్‌లో రాత్రి 7గంటలకు నిర్వహించే బహిరంగసభ, ధూంధాంలో మంత్రులతో పాటు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీమయం చేశారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికేందుకు, యువకులతో బైక్‌ర్యాలీ నిర్వహించేందుకు స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మంత్రుల పర్యటనను విజయంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement