గురువేనమః | today teachers day today | Sakshi
Sakshi News home page

గురువేనమః

Published Fri, Sep 5 2014 1:38 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

today teachers day today

 ‘‘గురు బ్రహ్మ..గురు విష్ణు..
 గురు దేవో మహేశ్వర
 గురుసాక్ష్యాత్ పరబ్రహ్మ
 తస్మయిశ్రీ గురువేనమః’’
 

 తపస్వి మాష్టారు పాఠాలు చాలా ఇష్టం
 ‘వ్యక్తికి క్రమ శిక్షణ నేర్పేది గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రభావం గురువుదే ఉంటుంది. విద్యార్థి దశలో నేర్చుకున్న క్రమశిక్షణ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. ఇది గురువు వల్లనే సాధ్యం. కరీంనగర్ జిల్లాలోని మా సొంత గ్రామమైన మంథనిలో 5వ తరగతి వరకూ చదువుకున్న పాఠశాల, అప్పట్లో పాఠాలు చెప్పిన తపస్వి మాస్టారు అంటే ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో అన్ని సబ్జెకులు కూడా తపస్వి మాస్టారే చెప్పేవారు. ఒక మనిషికి కుటుంబం తర్వాత క్రమ శిక్షణ నేర్పేది పాఠశాల, అక్కడి గురువులే. విద్యార్థి అభ్యున్నతికి పాఠాలు నేర్పిన గురువును గౌరవించుకోవటం మన బాధ్యత.’  - ప్రకాష్‌రెడ్డి, భద్రాచలం ఏఎస్పీ


 నా తండ్రే  నా ప్రథమ గురువు
 నా ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది. నా మొదటి గురువు మా నాన్నే. నల్లగొండ జిల్లాలోని చిన్నకొండూరు, తుమ్మలగూడెం, చెరువుమాదారం గ్రామాల్లోని పాఠశాలల్లో నేను ఏడో తరగతి వరకు చదువుకున్నాను. అక్కడే మా నాన్న పద్మయ్య కూడా ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ప్రభుత్వ పాఠశాల కనుక అన్ని క్లాసుల్లో అన్ని సబ్జెక్టులకు టీచర్లుండేవారు కాదు. అప్పుడు నేను చదువుతున్న క్లాసులో ఏ సబ్జెక్టుకు టీచర్లు లేరో ఆ సబ్జెక్టు చెప్పేందుకు ఆయన డ్యూటీ వేయించుకునేవారు. తన బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అదనంగా ఆ సబ్జెక్టు చెప్పేవారు.

సర్వేల్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నేను చేరేందుకు కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సర్వేల్ గురుకులంలో లెక్కల సార్ వీజీ.కృష్ణమూర్తి ఉండేవారు. ఆయనంటే నాకెంతో గౌరవం. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే నేను ఇంతటి స్థాయికి వచ్చాను. ఆయన కొడుకు రవీంద్ర కూడా నా క్లాస్‌మేట్. పరీక్షలయిన తర్వాత ఆయన ముందు దిద్దేది నా పేపరే. ఆయన కొడుకు కన్నా నాకు ఎక్కువ మార్కులు వస్తే హ్యాపీగా ఫీలయ్యేవారు. గ్రూప్స్‌లో కూడా నాకు లెక్కల సబ్జెక్టే ఉపకరించింది. రెండు పేపర్లలో కలిపి 300 మార్కులకు గాను 290 మార్కులు వచ్చాయి.

అదే మిగిలిన సబ్జెక్టుల్లో 100కు మించి రావడం కష్టం. ఆ రోజు కృష్ణమూర్తి సారు చెప్పిన లెక్కలే ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే... గురుకులం హాస్టల్‌లో కరెంటు లేకపోతే మమ్మల్ని వాళ్లింటికి తీసుకెళ్లి మాకు ఓ రూం ఇచ్చి చదువుకునేందుకు అవకాశం ఇచ్చేవారు కృష్ణమూర్తి సార్. ఎప్పుడైనా సర్వేల్ పాఠశాలకు వెళ్లి ఆయన ఉన్న క్వార్టర్‌ను చూస్తే ఇందులోనా మనం ఉండి చదువుకుంది... ఇంత చిన్న ఇంట్లో మాకు ఎలా అవకాశం ఇచ్చారో కృష్ణమూర్తి సార్ అనిపిస్తుంది. అందుకే గురుదేవోభవ అంటారు. - కడవేరు. సురేంద్రమోహన్, జాయింట్‌కలెక్టర్, ఖమ్మం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement