
నేడే ‘టెట్-2014’
- జంట జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి
- హైదరాబాద్ జిల్లా నుంచి 32,796మంది
- రంగారెడ్డి జిల్లా నుంచి 16,235 మంది
- నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించరు
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీటెట్) ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు జంటజిల్లాల నుంచి మొత్తం 49,031మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 192 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయాకేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్ట్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పార్ట్-2 పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ సజావుగా జరిగేలా రెండు జిల్లాలకు జాయింట్ డెరైక్టర్ స్థాయిలో పరిశీలకులను, స్క్వాడ్ బృందాలను నియమించారు.
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షాకేంద్రానికి చే రుకుంటే మంచిది. నిమిషం లేటైనా లోనికి అనుమతించరు.
పరీక్షాకేంద్రంలో ఇచ్చిన ఓఎంఆర్ షీట్లో అభ్యర్థుల వివరాలు తప్పుగా ఉన్నట్లైతే సరిదిద్దుకోవాలి.
ప్రశ్నపత్రం బుక్‌లెట్ కోడ్‌ను ఓఎంఆర్ షీట్లో తప్పనిసరిగా వేయాలి.
ఓఎంఆర్ షీట్‌లో జవాబుల(వృత్తాల)ను నింపడానికి బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.
హాల్‌టికెట్లు అందని అభ్యర్థులు వెబ్‌సైట్ http://aptet.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థుల వెంట హాల్‌టికెట్, బాల్‌పాయింట్ పెన్నులు మినహా.. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రింటెడ్ మెటీరియల్‌ను హాల్లోకి అనుమతించరు.
వికలాంగ అభ్యర్థులకు అవసరమైన వారికి స్కైబ్(టెన్త్ విద్యార్థుల)లను విద్యాశాఖాధికారులు ఏర్పాటు చేస్తారు.
పరీక్షాకేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్లు మినహా.. ఎవ్వరూ(డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇన్విజిలే టర్లతో సహా) సెల్‌ఫోన్లు వాడకూడదు.
300 ప్రత్యేక బస్సులు
టెట్ సెట్-2014 పరీక్షల కోసం 300 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ఎ. కోటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు విడతలుగా జరుగనున్న ఈ పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడుపుతారు. వీటిపైన ‘టెట్ స్పెషల్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు పేర్కొన్నారు.
కింది రూట్లలో ప్రత్యేక బస్సులు..
సికింద్రాబాద్ నుంచి కోఠీ, ఆఫ్జల్‌గంజ్, దిల్‌సుఖ్‌నగర్, బార్కాస్,ఈసీఐఎల్ నుంచి ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్, రీసాలాబజార్, మెహదీపట్నం నుంచి ఈసీఐఎల్, సికింద్రాబాద్ నుంచి చార్మినార్, జీడిమెట్ల,బోరబండ నుంచి కోఠీ, చార్మినార్, సికింద్రాబాద్ నుంచి సనత్‌నగర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, సఫిల్‌గూడ, తదితర ప్రాంతాలకు,ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, జగద్గిరిగుట్ట నుంచి సికింద్రాబాద్, వెంకటాపురం నుంచి సికింద్రాబాద్, హనుమాన్‌పేట్,తుకారంగేట్ నుంచి సికింద్రాబాద్ వరకు, కోఠీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి సనత్‌నగర్ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి.
సికింద్రాబాద్-శిల్పారామం, సికింద్రాబాద్-నాంపల్లి, గోల్కొండ-మెహదీపట్నం, గోల్కొండ-చార్మినార్,హిమాయత్‌సాగర్ -కోఠీ, హయత్‌నగర్-కోఠీ, దిల్‌సుఖ్‌నగర్-పటాన్‌చెరు,నాంపల్లి-దిల్‌సుఖ్‌నగర్, రాంనగర్-మెహదీపట్నం,ఆర్టీసీ క్రాస్‌రోడ్స్-బీర్‌బన్‌బాగ్, దిల్‌సుఖ్‌నగర్-కొండాపూర్, తదితర రూట్లలో ప్రత్యేక బస్సులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.