నేడు యాదాద్రికి రాష్ట్రపతి రాక
స్వాగతం పలకనున్న కేసీఆర్
భువనగిరి: రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ యాదాద్రికి వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆదివారం ఉదయం 11.10 గంటలకు వడాయిగూడెం హెలిప్యాడ్‌లో రాష్ర్టపతి దిగుతారు. 11.50కి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు గుట్టకు చేరుకుంటారు. సీఎం హెలికాప్టర్ కోసం మరో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు,ఉన్నతాధికారులు రాష్ర్టపతికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటారు. రాష్ట్రపతి వచ్చే వరకు సీఎం వేచి ఉండడానికి ప్రత్యేకంగా వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ర్టపతి వచ్చే వరకు సీఎం వేచి ఉంటారు. రాష్ట్రపతి హెలికాప్టర్‌లో ప్రయాణించే మార్గంలో ముందుగా గంటవరకు మరే హెలికాప్టర్‌ను అనుమతించరు. అందుకే సీఎం గంట ముందే యాదాద్రికి చేరుకోనున్నారు.
28 మంది వీఐపీలకే అనుమతి
రాష్ర్టపతి రాక సందర్భంగా కేవలం 28 మంది వీఐపీలను మాత్రమే అనుతిస్తారు. ఇందుకోసం రాష్ట్రపతి భద్రతాధికారి అన్షుమన్ పర్యవేక్షణలో రూపొందించిన మూడు హెలీప్యాడ్‌ల వద్దకు ఎవరినీ అనుమతించరు. కేవలం ఎంపిక చేసిన వీఐపీలు గవర్నర్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కొండపైకి వెళ్లే రాష్ట్రపతి కాన్వాయ్‌లో కేవలం 20 వాహనాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా రాష్ట్రపతి భద్రతాధికారులు వీఐపీలకు కేటాయిస్తారు. కాగా, హెలీప్యాడ్ నుంచి కొండపైన స్వామి వారి సన్నిధి వరకు రోడ్డుకు ఇరువైపులా నల్లగొండ జిల్లాకు చెందిన పోలీసులు భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ర్టపతి వెళ్లే వరకు నిరంతరం నిఘా కొనసాగుతుంది. ఇందుకోసం పోలీస్ యంత్రాంగం విధుల్లో నిమగ్నమైంది. వడాయిగూడెంలో రాష్ర్టపతి దిగే హెలిప్యాడ్‌ను కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్, జేసీ, ఏఎస్పీ, ఆర్డీఓ శనివారం పరిశీలించారు.