నేడు స్పీకర్ సిరికొండ రాక
- జిల్లాలో తొలి పర్యటన
- ఘనస్వాగతానికి ‘గులాబీ’ల ఏర్పాట్లు
- చెంచుకాలనీని సందర్శించనున్న మధుసూదనాచారి
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్‌గా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి బుధవారం జిల్లాకు రానున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. నూతన రాష్ట్రానికి తొలి స్పీకర్‌గా ఆయనకు అవకాశం రావడాన్ని జిల్లాకు గర్వకారణంగా భావిస్తున్నారు. పార్టీలకతీతంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.
పర్యటన షెడ్యూల్
ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని తన నివా సం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. 9 గంటలకు జిల్లా ప్రవేశద్వారం పెంబర్తి వద్ద ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. 10.15 గంట లకు మడికొండకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం కలెక్టర్ బంగ్లా సమీపంలోని కీర్తి స్థూపం, అమరవీరుల స్థూపం, కాళోజీ, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.
జయశంకర్‌సార్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అక్కడి నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆత్మకూరు... అక్కడి నుంచి శాయంపేటకు చేరుకుం టారు. అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించి, అమరుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
మధ్యాహ్నం 1.15 గంట లకు తన స్వగ్రామం నర్సక్కపల్లికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి పరకాలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం చెంచుకాలనీని సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తన సొంత నియోజకవర్గమైన భూపాలపల్లికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాత్రి 10.15 గంటలకు హన్మకొండలోని అర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అక్కడ బస చేయనున్నారు.