- మూడు దశల్లో 4,871 మందికి..
- నేటి నుంచే త్రైమాసిక పరీక్షలు
- మరోవైపు ‘స్వచ్ఛ విద్యాలయం’
విద్యారణ్యపురి : రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు సోమవారం నుంచి ఈనెల 22 వరకు మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, రేణుక, రవీందర్‌రెడ్డి, కృష్ణమూర్తి తమతమ డివిజన్లలో ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే జనగామ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ డివిజన్ల నుంచి ప్రతీ సబ్జెక్టుకు నలుగురు చొప్పున 7 సబ్జెక్టులకు 28 చొప్పున 112 మంది డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్(డీఆర్‌పీ)లు హైదరాబాద్‌లో శిక్షణ పొంది వచ్చారు. వీరు సోమవారం నుంచి లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో ప్రధానంగా 9వ తరగతి, టెన్త్‌లో మారిన పాఠ్యాంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాక ఈఏడాది టెన్త్‌లో 80 మార్కులు థియరీ, 20 మార్కులు ఇంటర్నల్స్‌గా పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఉంటుంది.
ఒక్కో సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్‌కు మూడు రోజులపాటు శిక్షణ ఉంటుంది. ఈనెల 13,14,15 తేదీల్లో ఒక దశ, ఈనెల 16,17,18 తేదీల్లో రెండో దశ, ఈనెల 20,21,22 తేదీల్లో మూడవ దశలో శిక్షణలు ఉంటాయి. జనగామ డివిజన్‌లో 1,258మందికి, మహబూబాబాద్‌లో 1,825మందికి, ములుగులో 1,290మందికి, వరంగల్‌లో 498 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. వీరు తాము బోధించే పాఠ్య పుస్తకాలు, లంచ్‌బాక్స్‌లు కూడా శిక్షణకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు రోజుకు రూ.80చొప్పున అందజేస్తారు.
అలాగే ఓవైపు ఉన్నత పాఠశాలలకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ జరగనుండగా.. ఈనెల 13నుంచే జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు.
ఈ మేరకు ఉన్నత పాఠశాలల్లో కొందరు టీచర్లు శిక్షణకు వెళితే.. మరికొందరు త్రైమాసిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా, త్రైమాసిక పరీక్షలు కొనసాగుతుండగా శిక్షణలు ఏర్పాటు చేయటంపై కూడా కొంత విమర్శలు వస్తున్నప్పటికీ తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయ పేర ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలున్నాయి.