పేదల పెన్నిధి రాజన్న
సాక్షి, మంచిర్యాల : విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆడపడుచులకు పావలావడ్డీ, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు 108,104, సాగు భూములకు జలకళ అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం, వికలాంగులు, వృద్ధులు సకాలంలో పెన్షన్లు ఇవన్నీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంచి పనుల్లోని కొన్ని అంశాలు.. మంగళవారం ఆ మహనీయుడి జయంతి. ఈ సందర్భంగా జిల్లావాసుల కోసం ఆయన చేసిన మంచి పనుల్లోని కొన్ని అంశాలు..
తెలంగాణ వరప్రదాయని ప్రాణహిత..
తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగు నీరందించిందాలనే బృహత్ లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి మదిలో నుంచి ఆవిష్కృతమైందే ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టు. రూ.38,500 కోట్ల వ్యయంతో 2008 డిసెంబరు 16న కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఇన్వెస్టిగేషన్, మెబిలైజేషన్ చెల్లింపుల కింద రూ.1,025 కోట్లు ఖర్చు చేశారు.
2009లో దివంగత వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టుపై చిన్నచూపు ప్రారంభమైంది. 2010-11 బడ్జెట్‌లో రూ.700 కోట్లు కేటాయించి రూ.33.57 కోట్లు విడుదల చేశారు. 2011-12 బడ్జెట్‌లో ఆర్భాటంగా ’608.28 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయలేదు. 2012-13లో రూ.1050 కోట్లు, 2013-14లో రూ.780 కోట్లు కేటాయించారు. ఈ విధంగా అరకొర నిధులతో పనులు జరగడంలేదు. కేవలం మూడు కిలోమీటర్ల పొడవున మాత్రమే పనులు చేపట్టారు.
ఆదిలాబాద్‌కు ఆధునిక వైద్యం
కనీస వైద్యానికి నోచుకోని ఆదిలాబాద్ ఆదివాసులకు ఆధునిక కార్పొరేట్ వైద్యం అందించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన మరో ఆపన్నహస్తం రిమ్స్. 2008లో రూ.128 కోట్ల నిధులతో రిమ్స్ నిర్మాణానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. రోగం ఏదైనా తక్షణ సేవలు అందించే స్థాయిలో రిమ్స్ అలరారుతుండటంతో పేద రోగుల మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. రిమ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ వార్డు వల్ల పేద రోగులు లబ్ధిపొందుతున్నారు. మరోవైపు రిమ్స్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తిచేసుకున్న వైద్యులు సమాజ సేవకు కదులుతున్నారు.
ఆధునిక విద్యకు అందలం
విద్యార్థులకు ఇన్షర్మేషన్ టెక్నాలజీ చదువుల కోసం తెలంగాణకు కేటాయించిన ట్రిపుల్ ఐటీ జిల్లాలోని చదువుల తల్లి నిలయమైన బాసరలో కొలువుదీరింది. విద్యార్థుల సాంకేతిక చదువులకోసం వైఎస్ ట్రిపుల్ ఐటీకి 2008లో పచ్చజెండా ఊపారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లను బాసర ట్రిపుల్ ఐటీకి కేటాయించారు. దీంతో శరవేగంగా తరగతి గదులు, వసతి భవనాలు, క్యాంపస్‌లు ఏర్పాటయ్యాయి. మొదట్లో ఫ్రీ ప్యాబ్రికేటెడ్ పద్ధతిలో భవనాలు నిర్మించినప్పటికీ వైఎస్సార్ ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించి పనులు పూర్తిచేయించారు. అయితే దివంగత వైఎస్ మరణానంతరం ట్రిపుల్ ఐటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
గోడు దూరం
గోదావరి నదిపై 20 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపకల్పనకు రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతన్నలకు నీటి వసతి లేదనే గోడు దూరం చేసేందుకు కార్యచరణ రూపొందించారు. 2004 జూలైలో ఎల్లంపల్లి జలాశయ నిర్మాణానికి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల కోసం రూ.408 కోట్లు మంజూరు చేశారు.
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 2 లక్షల రైతులకు సాగునీరు అందుతుంది. సాగునీటితోపాటు మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి మునిసిపాలిటీలకు గోదావరి తాగునీరు, ఎన్టీపీసీకి 6 టీఎంసీల నీరు, దండేపల్లి మండలం గూడెం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం వైఎస్ ఆశయం. అయితే ఆయన మరణానంతరం పనులు నత్తనడకన సాగాయి. దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ ప్రాజెక్టు త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు
అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వైఎ స్సార్ పెన్షన్లు మంజూరు చేశారు. దీంతోపాటు వికలాం గులకు చెల్లించే పెన్షను మొత్తాన్ని రూ.200 నుంచి రూ. 500కు పెంచారు. వృద్ధులకు, వితంతువులకు అప్పటివరకు చెల్లిస్తున్న రూ.75 మొత్తాన్ని రూ.200 చెల్లించారు. ఈ విధంగా సంతృప్తకర స్థాయితోపాటు పెన్షన్ మొత్తం పెంపుతో పండుటాకులతో పాటు విధివంచిత వికలాం గులు, వితంతువుల కళ్లల్లో ఆనందం వెళ్లివిరిసింది.
బడుగు విద్యార్థులకు భరోసా
ఉన్నత విద్య అభ్యసించేందుకు ఫీజులు చెల్లించేందుకు వెనకబడిన వర్గాల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రాజశేఖర రెడ్డి. జిల్లాలో ఈ విధానం ద్వారా వేలాది విద్యార్థులు లబ్ధిపొందారు. ఎందరో విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్, పీజీ వంటి తమ కలల కోర్సుల్లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో రీయింబర్స్‌మెంట్‌పై విధించిన ఆంక్షలతో బడుగులకు భరోసా దూరమయింది. అందుకే ప్రభుత్వ గణాంకాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.
2004-05 విద్యాసంవత్సరంలో జిల్లాలోని 14,744 మంది విద్యార్థులకు రూ.6,14,00,000 ఫీజు కింద ప్రభుత్వం చెల్లించింది. 2005-06లో 6,770 విద్యార్థుల కోసం రూ.3,63,00,000 చెల్లించారు. 2006-07 విద్యా సంవత్సరంలో 20,639 మంది విద్యార్థులకు రూ.7,12,00,000 చెల్లించారు. 2007-08లో 23,955 మంది విద్యార్థులకు రూ.11,64,00,000 సొమ్మును చెల్లించారు. 2008-09 విద్యాసంవత్సరంలో17,192 మంది విద్యార్థులకు 10,36,00,000 చెల్లించారు. 2009-10లో విద్యార్థులు ఫీజురీయింబర్స్ అర్హులు సంఖ్య పెరిగి17,364కు చేరినప్పటికీ క్రితం సంవత్సరం కంటే తగ్గించి రూ.7,30,00,000 కేటాయించారు.
వీటితోపాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందించి రైతన్నల కళ్లల్లో వెలుగురేఖలు నింపారు. దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి దళిత కాలనీలకు ఉచిత విద్యుత్ సౌలభ్యాన్ని పునరుద్ధరించారు. రాజీవ్ పల్లెబాట, రాజీవ్ నగరబాట కార్యక్రమాల ద్వారా పుర, గ్రామ ప్రజల సమస్యలను క ళ్లారా చూసి వాటిని తీర్చేందుకు అధికారులతో ప్రతిపాదనలు స్వీకరించి నిధులు మంజూరు చేశారు.