విషజ్వరాలు | Toxic fevers | Sakshi
Sakshi News home page

విషజ్వరాలు

Published Sat, Sep 20 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

విషజ్వరాలు

విషజ్వరాలు

  • మంచం పడుతున్న ప్రజలు
  •  వైద్య సేవలపై దృష్టిపెట్టని ఆరోగ్య శాఖ
  •  ప్రైవేట్ చికిత్సలతో జనం జేబులు ఖాళీ
  •  గాలిలో కలుస్తున్న పేదల ప్రాణాలు
  • సాక్షి, హన్మకొండ : పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రజలు మంచం పడుతున్నారు. సర్కారు వైద్యసాయం కింద అందే అరకొర గోలీలకు జ్వరాలు అదుపులోకి రావడం లేదు. మరోవైపు  ప్రైవేటు ఆస్పత్రి యజమాన్యాలు రకరకాల పరీక్షలు చేస్తుండటంతో రోగులు అప్పుల పాలవుతున్నారు. ఈ ఏడాది సగటు వర్షపాత తక్కువగా ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఓ మోస్తారు వర్షాలే కురిశాయి. వరదలు వచ్చేలా భారీ వర్షాలు కురవలేదు.

    ఈ తేలిక పాటి వర్షాల కారణంగా నీటి ఆవాసాల్లో పాతనీరు పోయి  కొత్త నీరు వచ్చింది తక్కువ. అంతేకాకుండాగతేడాదితో పోల్చితే వర్షాలు తక్కువగా ఉండటంతో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. గ్రామాల్లో మొక్కుబడిగా ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. నీటి ఆవాసాల్లో పెరుగుతున్న దోమలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టడం లేదు. సమస్యాత్మక గ్రామాలు అంటూ కేవలం 108 పల్లెల్లోనే ఫాగింగ్ చేపట్టారు. మిగిలిన గ్రామాల్లో ఈ పని చేయలేదు. దానితో దోమలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా కుటుంబంలో ఒకరికి జ్వరం వస్తే వెంటనే ఆ కుటుంబంలోని సభ్యులందరికీ పాకుతోంది.
     
    పరీక్షలతో జేబులు గుల్ల..

    సర్కారీ వైద్యసేవలు అరకొరగా అందుతుండటంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 40కి పైగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే ప్రతీరోగికి అవసరం ఉన్నా లేకపోయినా పలు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారుు. దానితో వైద్య ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇప్పటికైనా దోమలు పెరగకుండా తక్షణమే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఫాగింగ్ చేయూలి. నీటి ఆవాసాల్లో దోమలు పెరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు సరఫరా చేసే నీటిపై నమ్మకం లేక చాలా మంది క్యాన్లలో నీటిని కొనుగోలు చేస్తున్నారు.
     
    ఇచ్చిన గోలీలే ఇస్తాండ్రు

    నాకు ఇరవైరోజుల సంది జరమొత్తాంది. గౌర్నమెంట్ డాక్టర్లు వచ్చిండ్రంటే పోయిన. జరం, కాళ్లు, కీళ్లనొప్పులు, నీరసం ఉందన్నా. నాకు రెండు రకాల గోళీలు ఇచ్చిండ్రు. ఆ మందులు వాడినా ఏం తగ్గలే. మళ్లా డాక్టర్లు వచ్చిండ్రు. మళ్ల పోతే అయే గోళీలు ఇచ్చిండ్రు. ఇదేంది మేడమ్ మళ్ల అయ్యే గోళీలు ఇచ్చిండ్రు అని అడిగితే, పై నుంచి ఇవే వత్తనాయ్ అన్నరు. చేసేది లేక మా ఊళ్లో డాక్టర్ కాడికి పోయినా. గ్లూకోజ్ బాటిల్ పెట్టి మానుకోటలోని ఆస్పత్రికి పంపిండ్రు. అక్కడ బాటిళ్లు ఎక్కించి మందులు రాసిండ్రు. పరీక్షలకు, మందులకు రూ.12 వేలు అయినయ్. అయినా జరం తక్కువైతలేదు. పైసలు లేక ఇంటికి వచ్చిన. చేతిలో ఉన్న మందులనే వాడుతున్న.
     - బోడ అస్లీ, కాట్రపల్లి
     
    చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
     
    చిన్నపిల్లలకు వచ్చే వ్యాధుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన తప్పనిసరి. పిల్లలను చలిలో తిప్పడం, వర్షంలో తడనివ్వడం, ఐస్‌క్రీంలు తినిపించడం, శీతలపానీయాలు అతిగా తాగిపించడం మంచిది కాదు. జలుబు, జ్వరం ప్రారంభం కాగానే ఆవిరిపట్టడం, వెచ్చని దుస్తులు ధరించడం వంటివి చేస్తే సాధ్యమైనంత వరకు జ్వరంతో పాటు న్యుమోనియా వంటి వ్యాధులను అరికట్టవచ్చు. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదముంది. డాక్టర్ల సూచనలు పాటిస్తూ యాంటీబయాటిక్స్ మందులను ఏడు రోజుల పాటు కోర్సుగా వాడాలి. ఒకటి రెండు రోజులు వాడి వదిలిస్తే ఇబ్బందులు తప్పవు.
     - శేషుమాధవ్, పీడియాట్రీషన్
     
    వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి...   
     
    వర్షాకాలం రాగానే విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పరిసరాలలో నీరు నిల్వ ఉండ డంతో పాటు పారిశుధ్యం లోపించడం వల్ల జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వల వల్ల దోమలు వృద్ధి చెంది జ్వరాలు సోకే ప్రమాదం ఉంది. అంతే కాకుండా వర్షకాలంలోచల్లని పదార్థాలు సేవించకూడదు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
     - వి.చంద్రశేఖర్, ప్రొఫెసర్, ఎంజీఎం
     
     40 మందికి డెంగ్యూ
     ప్రాణాంతక మలేరియా, డెంగ్యూలతో పాటు చికున్‌గున్యా వ్యాధులు విజృంభిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు జిల్లాలలో 2,67,366 మంది నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా.. వీరిలో 76 మందికి మలేరియా సోకినట్లుగా నిర్థారణ అయింది. అదేవిధంగా 421 మంది జ్వరపీడితులకు పరీక్షలు చేయగా వీరిలో 40 మంది ప్రాణాంతక డెంగ్యూ, మరో 14 మందికి చికున్‌గున్యా సోకినట్లు తేలింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రాణాంతక వ్యాధుల ఆనవాళ్లు కనిపిస్తున్నా అందుకు తగ్గట్లుగా పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడంలో జిల్లా ఆరోగ్యశాఖ తరఫున అందడం లేదని రోగులు అంటున్నారు.
     
     పైసల్లేక ఇంటికి వచ్చిన
     15రోజులుగా జరమొత్తాంది. సర్కారోళ్లు మా ఊరికి వచ్చి అందరికీ పరీక్ష చేత్తాన్నరని ఎల్లిన. రెండు మార్లు పోతే నాకు, నాతోటోళ్లకి ఒకే రకం గోలీలు ఇచ్చిండ్రు. జరం తగ్గకపోవడంతో మానుకోట ఆసుపత్రికి పోయిన. అక్కడ రూ.10 వేల దాక ఖర్చయింది. ఇంకా ఉండాలని డాక్టర్లు అన్నరు. కానీ పైసల్లేక ఇంటికి వచ్చినమ్.
     - ఆంగోతు తుల్సమ్మ, కాట్రపల్లి
     
     జ్వరాల ‘కోట’
     మహబూబాబాద్ : విషజ్వరాలతో మానుకోట డివిజన్ ప్రజలు విలవిల్లాడుతున్నారు. సాధారణ రోజుల్లో ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య 400 నుంచి 500 మధ్య ఉంటుంది. కానీ... సీజనల్ వ్యాధుల మూలంగా ప్రతి రోజు ఓపీకి 500 నుంచి 800 మంది రోగులు వస్తున్నారు. వీరిలో సగానికి పైగా జ్వరపీడితులే కావడం గమనార్హం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement