కొత్త యజమానికి సంబంధం లేదు
♦ పాత యజమాని విద్యుత్ బకాయిలపై సుప్రీంకోర్టు
♦ టీఎస్‌పీడీసీఎల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: వేలంలో ఓ కంపెనీని కొనుగోలు చేసిన ప్పుడు పాత యజమాని విద్యుత్ బిల్లుల బకాయిలతో కొత్త యజమానికి సంబంధం ఉండదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ నెపంతో సదరు కంపెనీకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇలా ఓ కంపెనీకి విద్యుత్ కనెక్షన్ నిరాకరించిన తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌పీడీసీఎల్) తీరును తప్పుపట్టింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీఎస్‌పీడీసీఎల్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మెదక్ జిల్లా బొల్లారంలోని మెసర్స్ జేటీ అల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తీసుకున్న అప్పును చెల్లించకపోవడంతో ఆ కంపెనీ భూమి, ప్లాంట్, యంత్రాలను సిటీ యూనియన్ బ్యాంక్ వేలం వేసింది. ఆ వేలంలో గోపాల్ అగర్వాల్ ఆ కంపెనీ ఆస్తులను సొంతం చేసుకున్నారు. మెదక్ విద్యుత్ అధికారి సిటీ యూనియన్ బ్యాంక్‌కు లేఖ రాసి.. జేటీ అల్లాయ్స్ తమకు రూ.1.18 కోట్ల మేర విద్యుత్ బిల్లు బకాయి ఉందని, అందువల్ల వేలం ద్వారా వచ్చిన మొత్తంలో నుంచి తమకు ఈ బకాయిలు చెల్లించాలని కోరింది. అయితే వేలంలో వచ్చినదానికి తమకు చెల్లించాల్సిన మొత్తం సరిపోయిందని బ్యాంకు తెలిపింది.
జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు...
తాను కొన్న కంపెనీకి లోటెన్షన్ (ఎల్‌టీ) విద్యుత్ కనెక్షన్ కోసం గోపాల్ అగర్వాల్ దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి పాత యజమాని బిల్లు బకాయి ఉన్నారన్న కారణంతో అగర్వాల్‌కు విద్యుత్ కనెక్షన్‌ను తిరస్కరించడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. దీనిపై టీఎస్‌పీడీసీఎల్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ధర్మాసనం సైతం సింగిల్ జడ్జి ఉత్తర్వులనే సమర్థించింది. హైకోర్టు ధర్మాసనం తీర్పుపై టీఎస్‌పీడీసీఎల్ సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం... హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ కనిపించడంలేదని అప్పీల్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.