ఈటెల రాజేందర్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : వర్తకులు జీఎస్టీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలు చాలా కఠినతరంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సుశిల్ మోదీ నేతృత్వంలో నియమించిన కమిటీ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో జీఎస్టీ సమస్యలపై చర్చించారు. 3జీ అనే కొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టి, జీఎస్టీని సరళీకరిస్తారని ఈటెల పేర్కొన్నారు. ట్రేడింగ్‌కు ఇబ్బంది లేకుండా జీఎస్టీని అమలు చేస్తారని, రాబోయే జీఎస్టీ కౌన్సిల్‌లో కొత్త ప్రతిపాదనలు వస్తాయని తెలిపారు. గ్రౌండ్‌లో వచ్చిన సమస్యలను ఎప్పడికప్పుడు పరిష్కరిస్తూ.. ప్రజలకు కష్టం లేకుండా పన్ను కట్టే వారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలన్నారు. తెలంగాణ మొదటి నుంచి ప్రగతిశీల రాష్ట్రంగా ఉందని, ఎఫ్‌ఆర్‌బీఎస్ రుణాలను తగ్గించడానికి వీల్లేదని ఈటెల అన్నారు. ఈ రుణాలను 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయని, ఈ ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు.
42 శాతం పన్నుని వెనక్కి ఇస్తున్న నిబంధనను సమీక్షిస్తున్నారని వార్తలు వస్తున్నాయని, తగ్గిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రాలు కూడా చాలా పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రానికి ఒక నిబంధన, రాష్ట్రానికి ఒక నిబంధన అంటే సరికాదని పేర్కొన్నారు. పన్ను పంపిణీలో దక్షిణాదికి అన్యాయం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 2011 జనాభా ప్రాతిపదికనే నిధులను ఇస్తామనడం సరికాదని, జనాభాను తగ్గించి అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలన్నారు. కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తున్నాయని, అందువల్లే నగదు కొరత ఏర్పడుతుందన్నారు. దేశంలో 7.3 లక్షల కోట్ల ఎన్‌పీఏలు ఉన్నాయని తెలిపారు. నగదు కొరత లేకుండా చేయాలని అరుణ్‌జైట్లీని కోరినట్టు ఈటెల్ చెప్పారు. బ్యాంకులపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై, ఆర్‌బీఐపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment