సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా వ్యాపారం చేస్తూ పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న వారిని గుర్తించి వారిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది. గత ఐదు నెలల్లో నికరంగా జీఎస్టీ ట్రేడర్ల సంఖ్య 21 వేలకుపైగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 3.90 లక్షలుగా ఉన్న జీఎస్టీ ట్రేడర్ల సంఖ్య ఆగస్టు నాటికి 4.11 లక్షలకు దాటినట్లు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్.శేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. త్వరలోనే ఈ సంఖ్యను 5 లక్షలకు చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన తర్వాత ప్రతి నెలా నికరంగా 4,600 వరకు ట్రేడర్ల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపారు.
కోవిడ్ నేపథ్యంలో జీఎస్టీ ఆదాయం తగ్గడంతో రాష్ట్రంలో జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. వార్షిక వ్యాపారం రూ.40 లక్షలు దాటిన వారు జీఎస్టీ ట్రేడరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రేడర్లుగా నమోదు చేసుకున్న వారిలో 90 శాతం మందికిపైగా రిటర్నులు దాఖలు చేస్తున్నారు. అత్యధిక రిటర్నులు దాఖలు చేస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒకటిగా ఉందని అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి:
ప్రియుడు మోజులో భార్య.. భర్త మెడకు చీరచుట్టి..ఆపై!
అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్
Comments
Please login to add a commentAdd a comment