సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో తై బజార్ నిర్వహణ అధికారులకు గుదిబండగా మారింది. మున్సిపల్‌కు ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా కొత్త సంస్కరణలకు తెరలేపిన అధికారులకు తై బజార్ వేలం పాట కత్తిమీద సాములాగా మారుతోంది. ఆరు నెలలు గా ప్రభుత్వ నిర్ణీత ధరకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బందే తై బజార్ ఫీజు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు తైబజార్ వేలం పాటకు మున్సిపల్ యంత్రాంగం సమాయత్తం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో పోటీ దారులు ముందుకు రావడంలేదు. ఫలితంగా ఆరు నెలల కాలంలోనే ఎనిమిది సార్లు వేలం పాటను వాయిదా వేశారు.
కాగా ఈ నెల 29న మరోసారి తైబజార్ వేలం నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా గుర్తింపు పొందిన సిద్దిపేటలో తైబజార్ వసూలు బాధ్యతను కొంత కాలంగా మున్సిపల్ పర్యవేక్షిస్తోంది. గతంలో నామమాత్ర ధరకే తైబజార్ వేలం హక్కులను కైవసం చేసుకున్న వ్యాపారులు పెద్ద ఎత్తున మున్సిపల్ ఆదాయానికి గండికొట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నూతన కమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించిన రమణాచారి మున్సిపల్‌కు వచ్చే ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించి వ్యయ భారం నుంచి గట్టేక్కించేందుకు ప్రణాళికను రూపొందించారు.
అందుకనుగుణంగానే కొంత కాలంగా నిర్ణీత ధరను నిర్ణయించి వేలం పాట నిర్వహణకు ముందుకు సాగారు. సిద్దిపేటలోని వివిధ ప్రాంతాల్లో తోపుడు బండ్లు, వ్యవసాయ మార్కెట్, వీధి వ్యాపారం చేసే వారి నుంచి తై బజార్ పేరిట రూ. 5 నుంచి రూ.20 వివిధ కేటగిరీలో తై బజార్ ఫీజును నిర్ణయించారు. ఈ క్రమంలోనే 2014-15 సంవత్సరానికి సంబంధించిన తైబజార్ ఫీజు వసూలుకు సుమారు 4 లక్షల ప్రభుత్వ నిర్ణీత ధరకు వేలం పాటను నిర్వహించారు.
ఈ వేలం పాటకు పోటీ దారులు ముందుకు రాకపోవడంతో 8 పర్యాయాలు వాయిదా వేస్తూ వచ్చారు. చేసేది లేక ఆరు నెలలుగా సిద్దిపేట మున్సిపల్ సిబ్బంది ద్వారానే అధికారులు తై బజార్ వసూలు ప్రక్రియను చేపడుతున్నారు. రోజూ సుమారు 2వేల రూపాయలు తైబజార్ ఫీజు రూపంలో మున్సిపల్‌కు ఆదాయం వస్తుండటంతో వేలం పాటలో నిర్ణీత ధరను మార్చేందుకు నిరాసక్తత చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు వార్షిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోవడంతో ప్రభుత్వ నిర్ణీత ధరతో లాభాలు గడించడం పోటీ దారులకు సమస్యగానే మారింది.
‘నై’ బజార్..
Published Tue, Sep 23 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM
Advertisement
Advertisement