గ్రేడింగ్ చెరిపివేతపై రైతుల ఆగ్రహం
కేసముద్రం మార్కెట్‌లో గంటన్నరపాటు నిలిచిన పసుపు వేలం పాటలు
కేసముద్రం : మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పసుపు రాశులకు సెక్యూరిటీ గార్డులు వేసిన గ్రేడింగ్‌లను వ్యాపారులు చెరిపివేసి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో రైతులు గొడవకు దిగారు. దీంతో రైతులు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం పెరిగి పసుపు వేలం పాటలు నిలిచి పోయాయి. సోమవారం మార్కెట్‌కు సుమారు 2వేల బస్తాల పసుపు అమ్మకానికి వచ్చింది. మొదట సెక్యూరిటీ గార్డులు వచ్చిన పసుపు రాశులకు గ్రేడింగ్ విధానాన్ని సూచిస్తూ ఏ,బీ, సీ, ఇంటూ, ఎం ఇంటూ అనే గుర్తులు వేశారు. వాటి ప్రకారం వేలంపాటలు నిర్వహించాల్సిన వ్యాపారులు గ్రేడింగ్ తప్పు పడిందంటూ పలు రాశుల వద్ద గుర్తులను చెరిపివేసి ధరలను నిర్ణయిస్తూ వచ్చారు.
ఇలా ఎందుకు చేస్తున్నారంటూ మహమూద్‌పట్నం గ్రామానికి చెందిన రైతు వెంకటాచారి నిలదీయగా వ్యాపారులు అతనితో వాగ్వాదానికి దిగారు. ఇలాగైతే తాము కొనుగోళ్లు జరపలేమంటూ వ్యాపారు లు వేలంపాటలు నిలిపివేసి వెళ్లిపోయారు. అనంతరం మార్కెట్ అధికారులు జోక్యం చేసుకున్నా లాభంలేకుండా పోయింది. దీంతో రైతు లు మరింత ఆగ్రహానికి గురయ్యారు. నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించడంలేదం టూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు వ్యాపారులను ఒప్పించి గంటన్నర తర్వాత వేలంపాటలు ప్రారంభించారు. సోమవారం పసుపు క్వింటాలుకు గరిష్ట ధర రూ.5605, కనిష్ట ధర రూ.4300, గోళ రకానికి గరిష్టంగా రూ.5400, కనిష్టంగా రూ.4050 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.