కన్నీరు మిగిల్చిన ఉల్లి
Published Wed, Oct 5 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
- మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యం
–లాట్‌లు సరిగా లేవంటూ వేలంపాట నిలిపేసిన వైనం
– ధరలేక పంటను మార్కెట్‌లోనే వదిలేసిన రైతులు
–మంగళవారం ఒక్క రోజే 20 మందిది ఇదే పరిస్థితి
కర్నూలు(అగ్రికల్చర్):
నందికొట్కూరు మండలం వడ్డెమానుకు చెందిన శేషారెడ్డి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 250 బస్తాల ఉల్లిని తీసుకొచ్చారు. నాణ్యత బాగానే ఉన్నా వ్యాపారులు క్వింటాకు రూ.100కు మించి ధర పెట్టలేదు. రైతు మాత్రం రెండు ఎకరాల్లో సాగు చేసి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు.మార్కెట్‌లో కొనుగోలు దారులు కేవలం రూ100 కే అడగడంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. రవాణ చార్జీలు, ఉల్లిని తెంపడానికి అయిన ఖర్చులు కూడ గిట్టుబాటు కాకపోతుండటంతో మానసిక వేదనకు గురైన రైతు తెచ్చిన ఉల్లిని మార్కెట్‌లోనే వదిలేసి వెల్లాడు.
– సి.బెళగల్ మండలం పొన్నకల్‌కు చెందిన నాగన్న తెచ్చిన ఉల్లిని వ్యాపారులు కేవలం క్వింటా రూ.120 ప్రకారమే కొనుగోలు చేశారు. ఎకరాలో సాగు చేయగా దాదాపు 50వేలు పెట్టుబడి పెట్టారు. పంటను అమ్మితే రూ.10వేలు కూడా రాలేదు. దీంతో ఆ రైతు అందోళన అంతా, ఇంతా కాదు.
ఇలాంటి రైతులు జిల్లావ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. ఒకవైపు ధరలు పూర్తిగా పడిపోవడం, మరోవైపు అసలు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆందోళనకు గురవుతున్న రైతులు తెచ్చిన ఉల్లిని వదిలేసి వెళ్తున్నారు. మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లి భారీగా వచ్చింది. అయితే కొనుగోలులో నిర్లక్ష్యం నెలకొంది. జంబోషెడ్‌లో ఉల్లి బస్తాలను అస్తవ్యస్తంగా వేశారనే కారణంతో వ్యాపారులు వేలం పాట నిర్వహించలేమని చేతుతెత్తేశారు. ఇలా అడ్డదిడ్డంగా బస్తాలు వేస్తే ఉల్లి కొనేది లేదంటూ వేలంపాట బంద్ చేశారు. ధరలు పూర్తిగా పడిపోవడం, ఏదో ఒక ధరకు అమ్మకొనివెళ్లిపోదామంటే వేలంపాట నిర్వహించకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. పలువురు రైతులు ఉల్లిని మార్కెట్‌లోనే వదిలేసి వెల్లిపోయారు. మంగళవారం ఒక్క రోజే దాదపు 20 మంది రైతులు ఉల్లిని వదిలేసి వెల్లిపోయారు. మార్కెట్ కమిటీ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.
అధిక ధరలను చూపుతున్న మార్కెట్ కమిటీ....
కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ.. ధరలను ప్రకటించడంలో రైతులను దగా చేస్తోంది. ధరలు పూర్తిగా పడిపోయి అల్లాడుతున్నా అధిక ధరలున్నట్లు ప్రకటిస్తోంది. వ్యాపారులు రూ.50 నుంచి వేలంపాట ప్రారంభంచి అనేక లాట్లకు రూ.100. 120, 150 మాత్రమే ధర లభిస్తున్నా దీనిని అధికారులు మరుగున పెడుతున్నారు. కనిష్ట ధర రూ.300, 310గా ఉన్నట్లు చూపుతున్నారు. తక్కువ ఎక్కువ ధరలను ప్రకటించడంలో మార్కెట్ కమిటీ రైతులను దగా చేస్తుందనే విమర్శలున్నాయి. అధిక ధర రూ.700, రూ. 800గా ఉంది. అది కూడా కేవలం ఒక లాట్‌కు మాత్రమే అభిస్తున్నా దానిని అధికంగా ప్రచారం చేస్తుండటం గమనార్హం.
Advertisement
Advertisement