కారు టైరుకు లాక్ వేస్తోన్న ట్రాఫిక్ పోలీసులు
‘‘వీల్ లాక్.. దీనిని ట్రాఫిక్ పోలీసులు ఇటీవల తీసుకొచ్చారట. మా పనిలో మేముండగానే, మా కారు వీల్‌కు లాక్ వేసి వెళుతున్నారు. అది తీయాలంటే వేయి రూపాయలు ఫైన్ కట్టాలట. ట్రాఫిక్ ‘లాక్’తో పబ్లిక్ ‘లాస్’ అవుతున్నారు’’.. నగరంలోని నాలుగు చక్రాల వాహన చోదకులు/యజమానుల నుంచి వినిపిస్తున్న మాట ఇది. ఈ ‘లాక్’–‘లాస్’ ఏమిటో అర్థమవాలంటే.. ఇటీవల ఖమ్మంలో కారు యజమాని ఒకరికి ఎదురైన అనుభవాన్ని తెలుసుకోవాల్సిందే.
ఖమ్మంక్రైం: మధిరకు చెందిన అతని పేరు సంతోష్‌కుమార్. పెళ్లి బట్టలు కొనేందుకని ఇటీవల ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో తన కుటుంబీకులతో కలిసి కారులో ఖమ్మం వచ్చారు. కస్పాబజార్‌లోని వస్త్ర దుకాణం సమీపంలో దానిని పార్కింగ్ చేసి లోపలికి వెళ్లారు. బయటకొచ్చేసరికి 11 గంటలైంది. అందరూ కారులో కూర్చున్నారు. అది ముందుకు కదల్లేదు. ఏమైందో తెలియదు. అందరూ దిగి చూశారు. ముందు టైరుకు ఏదో వస్తువుతో లాక్ చేసి ఉంది. వారు ఆశ్చర్యపోయారు. అటూ ఇటూ చూశారు.
ఇంతలో ఎవరో వచ్చి, ‘‘కొద్దిసేపటి కిందట ట్రాఫిక్ పోలీసులొచ్చారు. మీ కారుకు వీల్ లాక్ వేశారు’’ అని చెప్పారు. ఏం చేయాలో సంతోష్‌కుమార్‌కు అర్థమవలేదు. తను అప్పటివరకూ షాపింగ్ చేసిన దుకాణంలోకి వెళ్లాడు. ‘‘సర్, మా కారుకు ట్రాఫిక్ పోలీసులు వీల్ లాక్ వేశారు. కాస్త, తీయమని చెప్పగలరా.. ప్లీజ్’’’ రిక్వెస్ట్ చేశాడు. షాపు యజమాని కాస్త అసహనంగా కదులుతూ, మొహమంతా చిరాగ్గా పెట్టి.. ‘‘మాకు సంబంధం లేద్సార్. మీరే మాట్లాడుకోండి’’ అంటూ సీట్లోంచి లేచి, ‘మీరిక దయచేయొచ్చు’ అన్నట్టుగా లైట్లు ఆర్పేయసాగాడు.
తమ వద్ద దాదాపుగా లక్ష రూపాయల విలువైన దుస్తులు తీసుకున్న సంతోష్‌కుమార్‌ను అప్పటివరకూ ఎంతో మర్యాదగా, గౌరవంగా చూసిన ఆ షాపు యజమాని, కేవలం రెండు నిముషాల తర్వాత ఇలా మారిపోవడాన్ని చూసిన సంతోష్‌కుమార్‌కు నవ్వాలో, ఏడ్వాలో తెలియలేదు. వీరు బయట ఉండగానే, ఆ షాపు యజమాని వెళ్లిపోయాడు. ఆ వెంటనే షట్టర్‌ను సిబ్బంది మూసివేసి వెళ్లారు. ఆ వీల్ లాక్‌పై ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాటికి ఫోన్ చేశాడు. అరగంట తరువాత ట్రాఫిక్ పోలీసులు వచ్చారు.
‘‘ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా రోడ్డుపై కారు పెట్టారు. అందుకే వీల్ లాక్ వేశాం. వెయ్యి రూపాయలు ఫైన్ కడితే తీస్తాం’’ అని చెప్పారు. ఆ కారు యజమాని ఇచ్చిన నగదును తీసుకుని వీల్ లాక్ తీశారు. ‘‘ఈసారి ఖమ్మానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కారులో రాను. బస్సులోనో, రైల్లోనో వస్తాను. కారులో వచ్చి ఇలా ‘లాస్’ చేసుకునేబదులు అదే బెటర్’’ అనుకుంటూ మధిరకు తిరుగు పయనమయ్యారు. ఇది, ఒక్క సంతోష్ సమస్యే కాదు. ఖమ్మంలోని అనేకమంది అనుభవాలు కూడా ఇలాంటివే.
‘‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు...
...అనేది సామెత. మున్సిపాలిటీ నుంచి నగర కార్పొరేషన్ వరక ఎదిగిన ఖమ్మంలోని మెయిన్ సెంటర్లలో ఎక్కడా కూడా కార్లు నిలిపేందుకు పార్కింగ్ స్థలమంటూ లేదు. రోడ్డు పక్కన కాకుండా ఎక్కడ పెట్టుకోవాలి? ఫలానా చోట పెట్టమంటే అక్కడే పెడతాం. అది చెప్పరు. ఎక్కడో ఒకచోట అనువైన ప్రదేశంలో మేం పార్కింగ్ చేస్తే.. ఎందుకిక్కడ నిలిపావని ప్రశ్నిస్తారు. ఇంకెక్కడ పెట్టాలి..? అసలు కారులోనే రావద్దా..? ట్రాఫిక్ పోలీసులు ఉద్దేశ్యమేమిటి..? ఇదెక్కడి చోద్యం..?’’ అని ప్రశ్నిస్తున్నారు నున్నా శ్రీకాంత్. వీల్ లాక్ బాధితులు అనేకమందిలో ఈయన ఒకరు.
లాక్.. షాక్.. వీక్..!
‘‘ట్రాఫిక్ నియంత్రణకు వీల్ లాక్ వేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మంచిదే..! ఎవరు మాత్రం కాదంటారు..?! కానీ, అదెప్పుడు..? పార్కింగ్‌కు నిర్ణీత ప్రదేశం ఉండాలి. వాటిని సూచిస్తూ బోర్డులు పెట్టాలి. ప్రధాన సెంటర్లలో/రోడ్లలో టూవీలర్ పార్కింగ్‌కు నిర్ణీత స్థలం (కొన్నిచోట్ల పార్కింగ్ ప్లేస్, ఇంకొన్నిచోట్ల రోడ్డుకు ఒక పక్కన) చూపిస్తున్నారు. మరి, కార్లకు కూడా అలా చూపించాలి కదా! ఇదేమీ చేయకుండా ట్రాఫికోళ్లు తమ ఇష్టానుసారంగా ఇలా చక్కాలకు తాళాలేసి వెళితే.. వాహన చోదకుల్లో వ్యతిరేకత క్రమేణా పెరుగుతుంది.
ఇదంతా చూస్తుంటే.. ‘జబ్బొకటి.. మందొకటి..’ అన్నట్టుగా ఉంది. ఈ వీల్ ’లాక్‘.. మాకు ‘షాక్’లాగా తగులుతోంది. నీరసాన్ని, నిస్సత్తువను (‘వీక్’.. వీక్‌నెస్) తెప్పిస్తోంది. ఆస్పత్రి పనికో, ఇంకేదైనా అత్యవసర పనికో వచ్చినవారి పరిస్థితేమిటి? ఇవేవీ ఆలోచించరా..?!’’ అని, నిరసన స్వరం వినిపించారు ఫోర్ వీలర్ యజమానులైన అనిల్, గుడా సంజీవ్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment