ఒక్క క్షణం ఆలోచిస్తే కుటుంబానికి శోకం ఉండదు: కళ్యాణ్‌రామ్‌ | Traffic Rules Awareness Rally in Hyderabad | Sakshi
Sakshi News home page

40 దాటొద్దు

Published Tue, Feb 5 2019 11:05 AM | Last Updated on Tue, Feb 5 2019 11:05 AM

Traffic Rules Awareness Rally in Hyderabad  - Sakshi

మాట్లాడుతున్న హోం మంత్రి మహమూద్‌ అలీ

రోడ్డు ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యం...తొందరపాటు...మితిమీరిన వేగమే. ఒక్క క్షణం దీనిపై యువత ఆలోచించాలి. హెల్మెట్, సీట్‌ బెల్ట్‌ తప్పక ధరించాలి. ట్రాíఫిక్‌ రూల్స్‌ పాటించాలి. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు 40 కిలోమీటర్లు మించి వేగంతో వెళ్లరాదని సూచిస్తున్నాం’ అని హోం మంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. సోమవారం సరూర్‌నగర్‌లో రహదారి భద్రతా వారోత్సవంలో ఆయన మాట్లాడారు.

సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 70 శాతం యువతే ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ అన్నారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సిన యువత  ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సోమవారం జరిగిన 30వ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా ట్రాఫిక్‌ అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ ఆలీ  పాల్గొన్నారు. మోటార్‌ సైకిల్‌ ర్యాలీతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు సేఫ్టీ ఆథారిటీ డైరెక్టర్‌ టి.కృష్ణ ప్రసాద్, లా అండ్‌ అర్డర్‌ అడిషనల్‌ డీజీ జితేందర్, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్, సినీ నటుడు కళ్యాణ్‌ రామ్, ట్రాపిక్‌ డీసీపీ దివ్యచరణ్‌ పాల్గొన్నారు. అనంతరం  హోంమంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణఖు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.707 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల తరహాలో రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసుల పనితీరుతో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహనాలు 40 కిలోమీటర్లు మించి వెళ్లరాదని సూచించారు. ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో ‘రోడ్డు ప్రమాదాల వీడియో’లను ప్రదర్శించాలని సూచించారు. ‘మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ కింద 2014లో 71 లక్షల కేసులు నమోదు కాగా 2018లో 1.30 కోట్ల కేసులు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర రోడ్డు సేఫ్టీ ఆథారిటీ డైరెక్టర్‌ టి.కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరగవన్నారు. ధ్వంసమైన రోడ్లు, బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి మరమ్మతులు చేపట్టామన్నారు. అతివేగం, డ్రంకన్‌ డ్రైవ్‌ కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.  ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు వసూలు చేస్తారన్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని విద్యాసంస్థలు తమ సంస్థలో ఎవరూ రోడ్డు ప్రమాదం బారిన పడలేదని నివేదిక ఇస్తే అవార్డు అందజేస్తామని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. రాచకొండలో ట్రాఫిక్‌ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు. 

ప్రాణం కంటే మించినది లేదు...
‘డ్రైవింగ్‌ చేసేటప్పుడూ హెల్మెట్‌ ధరించాలి. సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఆగాలి. రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేయవద్దు. ఇలా ట్రాఫిక్‌ నిబంధనలన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతో మంది కుటుంబాలకు శోకసంద్రాన్ని మిగిల్చింద’ని సినీ నటుడు కళ్యాణ్‌రామ్‌ అన్నారు.  2014, 2018లో తాను అన్న య్య, నాన్నను కోల్పోయానని, ప్రాణం కంటే మించింది ఏదీ లేదన్నారు.రహదారిపై వెళ్లేటప్పు డు ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, సిగ్నల్‌ దగ్గర ఒక్క నిమిషం ఆగి వెళ్లడం వల్ల సమయం మించిపోదన్నారు. ప్రజల బాగోగుల కోసమే పోలీసులున్నారని, వారికి సహకరించాలని కోరారు.  

ఆలోచింపచేసిన వీడియోలు...  
హెల్మెట్‌ ధరించకపోవడం, సిగ్నల్‌ జంపింగ్, అతివేగం వల్ల జరిగిన కొన్ని రోడ్డు ప్రమాదాల వీడియోలను రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ప్రదర్శించారు. హెల్మెట్‌ ధరించిన బైకర్‌కు ప్రమా దం జరిగినప్పుడు గాయాలు కాని వీడియోలను ప్రదర్శించారు. అభి బృందం రోడ్డు ప్రమాదాలపై చేసిన నాటకం విద్యార్థులను ఆలోచింపచేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement