నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా మాత్రమే పడుతోంది. ఇదే పని పోలీసులు చేస్తే వారికి ఫైన్‌తో పాటు ఎటాచ్‌మెంట్లు కూడా తప్పట్లేదు. 2017లోప్రారంభించిన ఈ విధానాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 310 మంది పోలీసు సిబ్బంది, అధికారుల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–చలాన్లు జారీ అయ్యాయి. వీరిలో కొందరికి ఉన్నతాధికారులు చార్జ్ మెమోలుజారీ చేయగా.. దాదాపు అందరినీ తాత్కాలిక ప్రాతిపదికన సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌కుఎటాచ్ చేశారు.
సాక్షి, సిటీబ్యూరో: నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా మాత్రమే పడుతోంది. ఇదే పని పోలీసులు చేస్తే వారికి ఫైన్‌తో పాటు ఎటాచ్‌మెంట్లు కూడా తప్పట్లేదు. 2017లో ప్రారంభించిన ఈ విధానాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 310 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉల్లంఘనలకు సంబంధించి ఈ–చలాన్లు జారీ అయ్యారు. వీరిలో కొందరికి ఉన్నతాధికారులు చార్జ్‌మెమోలు జారీ చేయగా.. దాదాపు అందరినీ తాత్కాలిక ప్రాతిపదికన సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు. మరోపక్క పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. గడిచిన 25 నెలలకు సంబంధించిన ‘పోలీసు డేటా’ను ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ ఇటీవల విడుదల చేశారు.
అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే...
రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలు ఉన్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్‌లోకి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనచోదకుడూ కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని సీపీ స్పష్టం చేశారు. లేని పక్షంలో సదరు వాహనాలను లోపలకు అనుమతించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ 2017లో కీలక నిర్ణయం తీసుకున్నారు.
యూనిఫాంలో ఉంటే సీరియస్...
నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అత్యధిక శాతం వీరు యూనిఫాంలోనే ఉంటున్నారు. ఈ సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వ వాహనాలూ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వీరిలో మార్పు తెచ్చేందుకు పలుమార్లు కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టిన అధికారులు 2017 నుంచి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
పక్కా ఆధారాలతో...
పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనేక రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా క్షేత్రస్థాయి విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న, పత్రికల్లో వస్తున్న ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అనేక మంది ప్రజలు పోలీసు అధికారిక ట్విటర్, వాట్సాప్, ఫేస్‌బుక్, హెల్ప్‌లైన్ నెం.9010203626, ఈ–మెయిల్ ద్వారానూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు.
ముందు ఫైన్... ఆపై చర్యలు...
ఇలా వివిధ మార్గాల్లో సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్థారించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసుల నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. దీనిపై నిర్ణీత గడువులోగా సంజాయిషీ ఇవ్వకపోయినా, సంతృప్తికరంగా లేకపోయినా తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరోపక్క పోలీసు సిబ్బంది/అధికారులకు చెందిన వ్యక్తిగత, అధికారిక వాహనాలపై ఎలాంటి జరిమానాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని సీపీ స్పష్టం చేశారు.
మిగిలిన విభాగాల మాటేమిటి?
ఇతర ఉల్లంఘనలతో పాటు మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కుతున్న వారిలో ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మందే ఉంటున్నారు. ఉల్లంఘనలపై పోలీసుల విషయంలో ఇంత సీరియస్‌గా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ఉల్లంఘనుల పైనా సీరియస్‌గా స్పందించకున్నా.. కనీసం మద్యం తాగి వాహనం నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి తీవ్రమైన వాటినైనా తీవ్రంగా పరిగణించాల్సి ఉంది. ఈ తరహా ఉల్లంఘనలు చేస్తూ చిక్కిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించడం, ఆయా జాబితాలను వారి కార్యాలయాలకు పంపి తదుపరి చర్యలు తీసుకునేలా చేస్తే నగరంలో ఏటా వేల సంఖ్యలో ఉల్లంఘనలు తగ్గే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment