ట్రాన్‌సఫార్మర్‌కు మరమ్మతు చేస్తూ..
విద్యుదాఘాతంతో రైతు మృతి
మర్పడగలో విషాదం
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనన్న గ్రామస్తులు
కొండపాక :
ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి వైరు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మర్పడగ శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రైతు వల్లంగల్ల కనకయ్య (46) తనకున్న రెండెకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా ఉదయం ఆరు గంటలకు పాలు తీసుకెళ్లి గ్రామంలో వేసి వచ్చాడు. అయితే కరెంట్ వచ్చే సమయంలో కావడంతో కనకయ్య పొలం వద్దకు వెళ్లి బోరు మోటారు ఆన్ చేశాడు. కాగా బోరుకు కరెంట్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి చూశాడు. ఇదిలా ఉండగా.. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉండే మూడు ఫ్యూజ్‌ల స్థానంలో బోల్టులు బిగించి ఉంటాయి. కాగా ఒక నట్ బోల్ట్ స్థానంలో అల్యూమినియం వైర్ చుట్టా రు. అది వేడికి పదే పదే కాలిపోతూ ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి రైలు ఎవరికి వారు వేసుకుంటుంటారు. అందులో భాగంగానే రైతు కనకయ్య ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేసి వైరును బిగించడానికి పైకి ఎక్కాడు. వైరును బిగిస్తున్న క్రమంలో మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌కు వచ్చే 11 కేవీ లైన్ ప్రమాదవశాత్తు కనకయ్య తలకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని మరో రైతు రంగయ్య గుర్తించి గ్రామంలోకి పరుగున వెళ్లి చెప్పాడు. బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య బాల లక్ష్మి, కుమారుడు వేణు (22), ఇద్దరు కుమార్తెలు లావణ్య (18), లత (15)లు ఉన్నారు. సమాచారం అం దుకున్న ఎస్‌ఐ జార్జ్ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించా రు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కొండపాక ఎంపీపీ పద్మ, పీఏసీఎస్ డెరైక్టర్ నరేందర్‌లు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుం బాన్ని ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ సభ్యులు బాల్‌రాజ్, ఆకారం, యాదగిరిలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే .. : ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతు కనకయ్య మృతిచెందాడని గ్రామ రైతులు పలువురు ఆరోపించారు. 15 రోజులుగా వైరు కాలిపోతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వీరి నిర్లక్ష్యంతోనే కనకయ్య మృతిచెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.