
టెజరీకి చేరిన ఇన్‌పుట్ సబ్సిడీ
ఎట్టకేలకు ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్ము జిల్లా వ్యవసాయశాఖ నుంచి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి చేరింది.
- త్వరలో రైతుల ఖాతాల్లోకి మొదటి విడత రూ.64.89 కోట్లు
- లబ్ధి పొందే రైతులు 1,52,953 మంది
నల్లగొండ అగ్రికల్చర్: ఎట్టకేలకు ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్ము జిల్లా వ్యవసాయశాఖ నుంచి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి చేరింది. పంటనష్టపోయిన రైతులు నాలుగేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. జిల్లాలో 2009-10 నుంచి 2014-15 సంవత్సరం దాకా వివిధ ప్రకృతి వైపరీత్యాల కారణంగా 50 శాతం కంటే ఎక్కువ పంట నష్టపోయినరైతుల వివరాలను జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దీనికి స్పందించిన సర్కారు ఇటీవల జిల్లాకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద 75.85 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీఓను జారీ చేసింది.
జిల్లాలో బ్యాంకు ఖాతా కలిగి ఉన్న రైతులు 1,52,953 మంది ఉన్నారు. వీరి అకౌంట్‌లలో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేయడానికి రూ. 64.89 కోట్లను జిల్లా వ్యవసాయ శాఖ సోమవారం జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపించింది. వారం రోజుల్లో ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో జమ కానుంది. దాదాపు 27,480 మంది రైతులకు బ్యాంకు అకౌంట్లు లేవు. దీంతో ఖాతా లేని కారణంగా రూ.10.94 కోట్ల ఇన్‌పుట్ పంపిణీకి నోచుకోకుండా నిలిచిపోయింది.
ఈనెల 20 లోగా ఖాతాలు తెరవాలి : కలెక్టర్
పంటనష్ట పరిహారం జాబితాలో పేర్లు ఉండి, బ్యాంకు ఖాతాలు లేని రైతులందరూ ఈ నెల 20 లోగా తమ బ్యాంకు ఖాతాలను తెరిచి అకౌంట్‌నంబర్‌ను వ్యవసాయ అధికారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ చిరంజీవులు సూచించారు. అదేవిధంగా బ్యాంకు ఖాతాలు లేని రైతులందరికి బ్యాంకు ఖాతాలు ఇప్పించిడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు కలెక్టర్ ఆదేశాలను జారీచేశారు. ఖాతాలు తెరవకుంటే మంజూరైన ఇన్‌పుట్ సబ్సిడీ వెనక్కి వెళ్లే పరిస్థితి ఉందన్నారు.