ఎన్నేళ్లు పడుతుందో..? | input subsidy distributes details | Sakshi
Sakshi News home page

ఎన్నేళ్లు పడుతుందో..?

Published Tue, Oct 4 2016 11:16 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ఎన్నేళ్లు పడుతుందో..? - Sakshi

ఎన్నేళ్లు పడుతుందో..?

–  సా...గుతున్న 2014 ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ
– మిస్‌మ్యాచింగ్‌తో అన్నదాతల అవస్థలు


ఖరీఫ్‌–2014లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటలకు సంబంధించి మంజూరైన పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) పరిహారం పంపిణీ పూర్తి చేయడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో అర్థంకాని విధంగా సా..గుతోంది. 2015 జూలైలో జిల్లాలోని 5.72 లక్షల మంది రైతులకు రూ.559.68 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే మంజూరై 15 నెలలవుతున్నా ఇప్పటికీ పంపిణీ కొనసాగుతుండటం విశేషం. పరిహారం కోసం రైతులు పడుతున్న కష్టాలు, అవస్థలు వర్ణనాతీతం. రైతులకు వచ్చే పరిహారం కన్నా దాని కోసం ఖర్చు చేసిన డబ్బు, వెచ్చించిన సమయం ఎక్కువైందంటే ఇన్‌పుట్‌ పంపిణీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతుంది. రైతులకు చెందాల్సిన పరిహారాన్ని సకాలంలో ఇవ్వకుండా అటు వ్యవసాయశాఖ అధికారులు ఇటు బ్యాంకర్లు నానా అవస్థలకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఫలానా తేదీనో, వారంలోనో ఇస్తామనే చెప్పేవారు లేరంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

2014 ఖరీఫ్‌లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌సబ్సిడీ కింద 5,79,646 మంది రైతులకు రూ.567.32 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో కొన్ని నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నట్లు తేలడంతో పరిశీలన తర్వాత 5,72,111 మంది రైతులకు రూ.559.68 కోట్లకు ఇన్‌పుట్‌సబ్సిడీని కుదించారు. 2015 జూలై 22న పైన తెలిపిన మొత్తాన్ని జిల్లాకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ మొదటి విడతగా కొంత మొత్తాన్ని విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడెనిమిది సార్లు కొంచెం కొంచెం విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 5.27 లక్షల మంది రైతులకు రూ.505.68 కోట్లు బ్యాంకుల్లో జమ చేశారు. అయితే జాబితాలు తప్పులతడకలుగా ఉండటంతో వచ్చిన పరిహారం కూడా రైతులకు అందని పరిస్థితి కల్పించారు. మిస్‌మ్యాచింగ్‌ జాబితాలో 16 వేల మంది రైతులకు చెందిన రూ.15 కోట్లు బ్యాంకుల్లో నిలిచిపోయింది. జాబితాను సరి చేసుకునేందుకు బాధిత రైతులు ఆర్జీలు ఇచ్చుకుంటున్నా పనికావడం లేదు. ఏఓ, తహశీల్దార్, ఏడీఏ, ఆర్డీఓ, జేడీఏ, జిల్లా గ్రీవెన్స్‌... ఇలా అన్ని చోట్ల ఒకటికి నాలుగు సార్లు తిరిగి ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. కొందరు రైతులు తిరిగితిరిగి వేసారిపోయి పరిహారం వద్దనుకునే పరిస్థితి కల్పించారు. వీటికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా పరిహారం వర్తింపజేయడంతో అర్హులైన రైతులకు తీరని అన్యాయం జరిగింది.

రూ.54 కోట్లు అంతేనా...?
జిల్లాకు మంజూరు చేసిన రూ.559.68 కోట్లలో ఇప్పటివరకు రూ.505.68 కోట్లు విడుదలైంది. ఇంకా రూ.54 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. ఇపుడున్న పరిస్థితి చూస్తే ఈ మొత్తం విడుదల కావడం అనుమానంగానే కనిపిస్తోంది. ఆధార్‌ అనుసంధానంతో రూ.2 కోట్ల పరిహారం కోసం అర్హులైన జాబితా సిద్ధంగా ఉంది. ఎనిమిదో విడత కింద పరిహారం మంజూరు చేస్తారా లేదా అనేది అధికారులు చెప్పడం లేదు. మరోవైపు మంజూరైన రూ.505.68 కోట్లలో మిస్‌మ్యాచింగ్‌లో నిలిచిపోయిన రూ.15 కోట్లు మొత్తాన్ని సరిచేసి రైతులకు పూర్తి స్థాయిలో ఇవ్వడం కూడా అనుమానంగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇన్‌పుట్‌ కోసం రైతులు ఆందోళనలు చేస్తూ రోడ్డెక్కుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మొత్తమ్మీద 50 వేల మంది రైతులకు చెందాల్సిన రూ.54 కోట్లు పరిహారం చివరకు ప్రభుత్వ ఖజానాకే జమ అయ్యే పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement