సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ముకరంపుర: మొక్కలు నాటే విషయంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం ఆంకురార్పణ చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు సహా ప్రజలందరి భాగస్వామ్యంతో మహోద్యమ కార్యక్రమంగా హరితహారాన్ని ప్రారంభించింది. జిల్లాలో నియోజకవర్గానికి కనీసం 30 లక్షల చొప్పున వారం రోజుల్లో 3.5 కోట్ల మొక్కలను నాటేందుకు నడుం బిగించింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు శుక్రవారం సాయంత్రం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పండ్ల మొక్కలకు డిమాండ్
తొలిదశలో 3.5 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించిన అధికారులు సింగ రేణి కాలరీస్ ఆధ్వర్యంలో 90 వేల పండ్ల మొక్కలను సిద్ధం చేశారు. మిగిలిన మొక్కలతో పోలిస్తే పండ్ల మొక్కలకు డిమాండ్ ఏర్పడింది. ఇండ్లల్లో ఎక్కువగా పండ్ల మొక్కలను పెంచేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఆశించిన స్థాయిలో సరఫరా ఉండటం లేదని తెలుస్తోంది.
మిగిలిన మొక్కల విషయానికొస్తే టేకు, ఎర్ర చందనం, వెదురు, సిల్వర్‌ఓక్, తుమ్మ, ఈత, కానుగ, పచ్చ తురాయి, గుల్మొహార్, రేల, నిద్రగన్నేరు, వేప, మునగ, కరివేప, ఇతరత్రా మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో మొక్క పెంపకానికి సుమారు రూ.9 వరకు ఖర్చవుతున్నట్లు పేర్కొన్నారు. ఇంటి స్థలాన్ని బట్టి ఒక్కో కుటుంబానికి 3 నుండి 15 వరకు మొక్కలను పంపిణీ చేస్తామన్నారు.
ట్రీగార్డుల కోసం విరాళాల సేకరణ
మొక్కలు నాటేందుకు అవసరమైన నిధులను కేటాయించిన ప్రభుత్వం వాటి సంరక్షణలో కీలకమయ్యే ట్రీగార్డుల పంపిణీకి నిధులు కేటాయించలేదు. దీంతో అధికారులు, గ్రామ సంరక్షణ కమిటీలు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ వ్యక్తులతోపాటు స్వచ్చంద సంస్థలు, అసోసియేన్లు సహా ముందుకొచ్చే అన్ని వర్గాల నుంచి విరాళాలుగా సేకరిస్తున్నారు.
ఉపాధి సిబ్బంది సమ్మె ఎఫెక్ట్
ప్రజాప్రతినిధులు, అధికారులంతా తమ ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమాన్ని పండుగలా జరిపేందుకు సమాయత్తమయ్యారు. వెళ్లిన ప్రతిచోట మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మొక్కలు నాటేందుకు కూలీలు కరువయ్యారు. మొక్కలు నాటే కార్యక్రమంలో కీలకపాత్ర పోషించాల్సిన సుమారు 1600 మంది ఉపాధిహామీ సిబ్బంది పక్షం రోజులుగా సమ్మె చేస్తున్నారు. మరోవైపు 2600 మంది గ్రామ పంచాయతీ కార్మికులు సైతం గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 4200 మంది సిబ్బంది తమ డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేస్తుండటంతో హరితహారంపై ఆ ప్రభావం పడనుంది.
గుంతలేవీ...?
ప్రైవేట్ సెక్టార్ పరిధిలో ఇండ్లు, ప్రైవేట్ పాఠశాలలు, పరిశ్రమలు మినహాయించి రహదారులకు ఇరువైపులా, రైతుల పొలంగట్లు, శిఖం భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో ఉపాధి కూలీల ద్వారా గుంతలు తీయాల్సి ఉంది. దాదాపు కోటిన్నరకు పైగా మొక్కలు నాటేందుకు గుంతలు తీయల్సి ఉండగా... ఇప్పటి వరకు 3లక్షల గుంతలు కూడా తవ్వలేదని తెలుస్తోంది.
ఉపాధిహామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేయడం కూడా దీనికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. వీరి సమ్మె నేపథ్యంలో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాల అధికారులు సిబ్బందిని ప్రత్యామ్నాయ సేవలకు వినియోగిస్తున్నప్పటికీ గుంతల తవ్వకాల పర్యవేక్షణలో సరైన అనుభవం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని తెలుస్తోంది.
హరితోద్యమం
Published Sat, Jul 4 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement