
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మేయర్ ఎన్నికపై టీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 27న మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సరైన వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రేటర్ వరంగల్ మేయర్ ఎంపిక అంశంపై పార్టీ తరఫున ఇన్‌చార్జిగా టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లుకు బాధ్యతలు అప్పగించింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వరంగల్‌కు వెళ్లి అక్కడి పార్టీ నాయకులు, కార్పొరేటర్ల అభిప్రాయాలను సేకరించాలని బాలమల్లును ఆదేశించారు. మంగళవారం బాలమల్లు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ మేయర్ ఎన్నికపై చర్చ జరిగింది. అందరి అభిప్రాయాలను సేకరిస్తామని, ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామని బాలమల్లు హామీ ఇచ్చారు.
వరంగల్ నగరానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు అందరినీ కలుపుకుపోతామని పేర్కొన్నారు. బాలమల్లు వరంగల్‌కు వెళ్లి సేకరించిన అభిప్రాయాలతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తారని కేటీఆర్ తెలిపారు. వరంగల్ మేయర్‌గా ఉండే నన్నపనేని నరేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మేయర్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వరంగల్ మేయర్ పదవికి 27న ఎన్నిక జరగనుంది. టీఆర్‌ఎస్‌లో మేయర్ పదవి కోసం పోటీ ఎక్కువగానే ఉంది. కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌రావు, నాగమల్ల ఝాన్సీ, బోయినపల్లి రంజిత్‌రావు, గుండు అశ్రితారెడ్డి ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించిన అనంతరం టీఆర్‌ఎస్ అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.