
రేవంత్.. మహిళలకు క్షమాపణ చెప్పు: టీఆర్ఎస్
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ కవిత పేరు సమగ్ర కుటుంబ సర్వేలో రెండుచోట్ల నమోదైందని అసెంబ్లీలో మంగళవారం నాడు రేవంత్రెడ్డి ఆరోపించారు. అయితే దానికి ఆధారాలు చూపించాలంటూ ఆయనను మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన విషయం గురించే తాను మాట్లాడినట్లు రేవంత్ తెలిపారు.
తప్పుడు ఆధారాలతో నిజామాబాద్ ఎంపీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, అందుకు ఆయన బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే కొండా సురేఖ డిమాండ్ చేశారు. సభను తప్పుదోవ పట్టించినందున రేవంత్ను సస్పెండ్ చేయాలని మరో ఎమ్మెల్యే గొంగడి సునీత డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఒక ఎంపీమీదే ఇలాంటి ఆరోపణలు చేస్తే, ఇతర మహిళలను ఎలా గౌరవిస్తారని ఆమె ప్రశ్నించారు.