ఉద్యోగాల భర్తీలో సర్కార్ ఫెయిల్
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగా లు ఖాళీగా ఉన్నా మూడేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేక పోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పన, అవకాశాలు తగ్గిపోయాయన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా యువత, విద్యార్థులు ఉద్యోగాల డిమాండ్‌పై ప్రధానంగా పోరాడిన విషయాన్ని మరిచిపోరాదన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో జాప్యం జరుగుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని కల్పిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా వర్సిటీలో నిర్వహించే ధర్మయుద్ధ సభకు కాంగ్రెస్ పూర్తి మద్దతునిస్తుందన్నారు. తెలంగాణలో ఐటీఐఆర్ ఏర్పాటుపై కేసీఆర్ ప్రభుత్వం మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ తెలిపారు. కేంద్రం సహకారం తీసుకుని రైతులకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్‌ను చెల్లిస్తామన్నారు.