
అధైర్యపడకండి..అండగా ఉంటాం
సిద్దిపేట రూరల్: ‘‘అధైర్యపడకండి..అండగా ఉంటాం.. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు..ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతులకు ఏ సమస్యలున్నా స్థానిక నాయకులను, అధికారులను సంప్రదించాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఇటీవలకాలంలో ఆత్మహత్య చేసుకున్న పదకొండు మంది రైతుల కుటుం బాలకు రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీష్‌రావుమాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరి గిందని, ఇప్పుడు మన రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతోనే ప్రణాళికలు రుపొందిస్తున్నామన్నారు. ప్రతి రైతు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి రూ. వెయ్యి పిం ఛన్, అంత్యోదయకార్డుతో పాటు పదవ తరగతి లోపు చదువుకునే విద్యార్థులుంటే వారికి రెసిడెన్సీ పాఠశాలలో ఉచి త విద్యను అందిస్తామన్నారు.
అదేవిధంగా ఇంటర్‌పైగా చదువుతున్న విద్యార్థులకు అదనంగా రూ. 10 వేలు అందిస్తామని చెప్పారు. ఇళ్లు నిర్మించుకోవాలని ఆసక్తి ఉంటే ఐఏవై కింద ఇళ్లు మంజూరుచేయిస్తామన్నారు. వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మెదక్ జిల్లాలో రైతులకు సాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఇబ్బందిని తొలగించేందుకు ప్రాణహిత- చేవేళ్ల పథకం ద్వారా జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపడుతోందని, దీని ద్వారా రైతులకు సాగునీటి కష్టాలు దాదాపుగా తీరుతాయన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారె డ్డి మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యల ను నివారించేందుకు సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ పెద్దకొడుకుగా మారి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుం టున్నాడన్నారు. అంతకు ముందు కొండపాక మండలానికి చెందిన ఇద్దరు రైతు కుటుంబాలకు ఆపద్భందు కింద రూ. 50 వేల చొప్పున చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీలు ఎర్ర యాదయ్య, పద్మ, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్‌వై గిరి తదితరులు పాల్గొన్నారు.
మిల్క్ గ్రిడ్‌తో పాడి రైతులకు మేలు
సిద్దిపేట కొండమల్లయ్య గార్డెన్‌లో ఆదివారం మధ్యాహ్నం మంత్రి హరీష్‌రావు సిద్దిపేట, దుబ్బాక మిల్క్ గ్రిడ్ పథకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ సహకార సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మా ట్లాడుతూ, సిద్దిపేట-దుబ్బాక నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో మిల్క్ గ్రిడ్ పథకం కోసం ప్రభుత్వం రూ. 60 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో గుజరాత్, పంజాబ్‌ల నుంచి తెచ్చిన పాడి గేదెలు సరైన ఫలితాలను ఇవ్వకపోవడంతో ప్రభుత్వం పాడి గేదెలు, ఆవుల కొనుగోలులో సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీంతో రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ఎక్కడి నుంచైనా పాడి పశువులను ఖరీదు చేసే అవకాశం ఉందన్నారు.
సబ్సిడీలను బ్యాంక్ ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించడం కోసం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించినట్లు చెప్పారు. రూ. 80 లక్షలతో సిద్దిపేటలో మిల్క్ ప్యాకెట్ల తయారీ యంత్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రూ. 75 లక్షలతో రైతులు పాలతో తయారు చేసే వెన్న, జున్ను, మజ్జిగ, కోవ, పెరుగు తదితర పదార్థాలను తయారు చేయడానికి వీలుగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం రూ. 2 కోట్ల సబ్సిడీని వ్యవసాయ పనిముట్ల కోసం మంజూరు చేసిందన్నారు. తోర్నాలలో రూ. 5 కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను, రూ. 6.30 కోట్లతో మొక్కజొన్న పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు హరీష్‌రావు వెల్లడించారు.
ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీ
సాగులో యంత్రికీకరణను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆధునిక ట్రాక్టర్లను కూడా రైతులకు 50 శాతం సబ్సిడీ తో అందించనున్నట్లు హరీష్‌రావు తెలిపారు. రైతులు 50 శాతం సబ్సిడీతో ఎన్ని టార్పాలీన్‌లనైనా కొనుగోలు చేయవచ్చన్నారు. గొర్రెల పెంపకం కోసం రూ. 10 కోట్ల ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని చెప్పారు. నిధులు మంజూరు కాగానే 20 శాతం సొమ్ము గొర్రెల, మేకల పెంపకందారులు చెల్లిస్తే మిగిలి మొత్తం సబ్సిడీ రూపంలో వస్తుందన్నారు.
చెరువుల పునరుద్ధరణకు రూ. 180 కోట్లు
చెరువుల పునరుద్ధరణకు గాను సిద్దిపేట నియోజకవర్గానికి రూ. 80 కోట్లు, దుబ్బాక నియోజకవర్గానికి రూ. 100 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రి హరీష్‌రావు చెప్పారు. భూగర్భ జలవనరుల రక్షణకు సద్వినియోగం చేయాలన్నారు. చెరువులు, కుంటల్లో మట్టిని తొలగించి కట్టల మరమ్మత్తుకు వినియోగించాలని, అడుగులోని నల్లమట్టిని పొలాల్లోకి తరలించాలని సూచిం చారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఏజేడీ లక్ష్మారెడ్డి, పాడి పరిశ్రమ సహకార సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ జీఎం పాపారావు, డీఎల్ ఏఏ జనార్ధన్‌రెడ్డి, నాబార్డ్ ఏజీఎం రమేష్, సిద్దిపేట పాలకేంద్రం మేనేజర్ భానుప్రసాద్, ఆర్డీఓ ము త్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్‌వై గిరి, పశువైద్యులు అంజయ్య, బాలసుం దరం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, నేతలు వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీలు ఎర్రయాదయ్య, జాప శ్రీకాం త్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి పాల కేంద్రంలో పాల ప్యాకెట్ల తయారీ యంత్రాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. పాడి రైతుల శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
అదనపు పాలధర చెక్కుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పాలకు రూ. 4 పెంచిన క్రమంలో లబ్ధిపొందిన పాడి రైతులకు మంత్రి హరీష్‌రావు అదనంగా పొందిన డబ్బులకు సంబంధించి చెక్కులను సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు చెందిన పాడి రైతులకు పంపిణీ చేశారు.