సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం స్థానాలను కైవసం చేసుకుంది. పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (పీఎస్‌ఆర్) ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాలలో జడ్‌పీ టీసీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పదిలమయ్యాయి. ఎంపీటీసీ స్థానాలలోనూ వారికి ఆధిక్యం లభించింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం పరిధి లోని మొత్తం నాలుగింటిలో రెండు జడ్‌పీటీసీ స్థానాలు, మెజార్టీగా 33 ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధ న్‌కు మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ‘స్థానిక’ంలో ఎదురుదెబ్బ తగిలింది.
కాగా బాల్కొండ నియోజకవర్గంలోని ఐదు జడ్‌పీటీసీ స్థానాలకు గాను నాలిగింట టీఆర్‌ఎస్ గెలవగా ఒక్కటే కాంగ్రెస్‌కు దక్కింది. ఆర్మూరు నియోజకవర్గంలో మూ డు జడ్‌పీటీసీ స్థానాల్లో రెండు టీఆర్‌ఎస్ కు దక్కాయి. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మా జీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిలకు జడ్‌పీటీసీల్లో ఆధిక్యం ద క్కలేదు. జడ్‌పీటీసీ ఎన్నికల్లో ఖాతా తెరవకుం డా పూర్తిగా పతనమై పోయిన తెలుగుదేశం పా ర్టీ ఎంపీటీసీ సభ్యుల విషయంలోను బీజేపీ కం టె వెనుకబడి పోయింది. మున్సిపల్, ‘పరిషత్’ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికిని కోల్పోయింది.
క్షణక్షణం టెన్షన్
రెండు విడతలలో జరిగిన ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు మంగళవారం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. 36 జడ్‌పీటీసీ, 570 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీలలో రెండు విడతలలో ఎన్నికలు జరిగాయి. 36 జడ్‌పీటీసీలకు 195 మంది, 570 ఎంపీటీసీ స్థానాలకు 2,819 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, గ్రామీణ ప్రాంతాలలోని మొత్తం 14,15,153 మంది ఓటర్లకు గాను 10,87,821 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ధర్పల్లి మండలం మై లార ం, పిట్లం మండలం బండపల్లి ఎంపీటీసీలకు 18న రీ-పోలింగ్ జరగనుంది. కాగా నిజామాబాద్, బోధన్, కామారెడ్డి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. 24 జడ్‌పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్, 12 జడ్‌పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్నాయి.
గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు 20, టీఆర్‌ఎస్‌కు 4, టీడీపీకి 12 జడ్‌పీటీసీ స్థానాలు దక్కగా, ఈ సారి టీడీపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలా ఉన్న ఇందూరు జిల్లాలో బీటలు బారాయి. కాగా 581 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్‌ఎస్ 240, కాంగ్రెస్ 225 దక్కించుకున్నాయి. బీజేపీ 34, టీడీపీ 31, ఎంఐఎంకు రెండురాగా, 49 స్థానాల్లో స్వతంత్రులు, ఇతరులు గెలుపొందారు. ఎంపీటీసీ ఎన్నికల్లోను టీడీపీకి బీజేపీ కంటే మూడు స్థానాలు తక్కువ వచ్చాయి.