సుస్తీ లేని బస్తీలు | TRS Government Open 45 Basthi Dawakhana in Hyderabad | Sakshi
Sakshi News home page

సుస్తీ లేని బస్తీలు

Published Sat, May 23 2020 8:09 AM | Last Updated on Sat, May 23 2020 8:09 AM

TRS Government Open 45 Basthi Dawakhana in Hyderabad - Sakshi

జూబ్లీహిల్స్‌ యాదగిరినగర్‌లో బస్తీ దవాఖానాను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌

బస్తీ వాసులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఉద్దేశించిన ‘బస్తీ దవాఖానాలు’ నగరంలో మరో 45 చోట్ల ప్రారంభమయ్యాయి. శుక్రవారం మంత్రులు కేటీఆర్, ఈటల, తలసాని, సబిత, మహమూద్‌ అలీ, మల్లారెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. బస్తీవాసులకు ఇకపై చక్కటి వైద్యం అందించాలని, వీరు ప్రైవేట్‌ ఆస్పత్రుల వైపు వెళ్లే పరిస్థితి రాకుండా స్థానికంగానే మంచి వైద్యం అందించాలని డాక్టర్లు, సిబ్బందికి మంత్రి కేటీఆర్‌ సూచించారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ కారణంగానే నగరంలో పెద్ద సంఖ్యలో బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయని ఆయన చెప్పారు.  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో శుక్రవారం ఒక్కరోజే 45 బస్తీ దవాఖానాలు కొత్తగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే 123 బస్తీ దవాఖానాలు పనిచేస్తుండగా, వీటి సేవలు బాగున్నాయని భావించిన ముఖ్యమంత్రి వెంటనే మరో 45 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో వీటిని ప్రారంభించారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల తరహాలో పేద ప్రజలకు దవాఖానాలు ఉండాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో 300కు పైగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో అధికారులున్నారు. వీటికి అవసరమైన భవనం, మౌలిక సదుపాయాలు జీహెచ్‌ఎంసీ సమకూరుస్తుండగా, వైద్యానికి సంబంధించి డాక్టర్లు, తదితర సిబ్బందిని వైద్యారోగ్యశాఖ నియమిస్తోంది. దాదాపు 5 నుంచి 10 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానా ఉండాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల ఫీజులను భరించలేని పేదలకు ఉపకరించాలనే లక్ష్యంతో బస్తీదవాఖానాలు ఏర్పాటు చేశారు. సాధారణ జ్వరం తదితర వాటికి చికిత్సలతోపాటు అవసరమైన వారికి వ్యాధి నిర్ధారణ కోసం దాదాపు 57 రకాల పరీక్షలు నిర్వహించేందుకు  రక్త నమూనాలు సేకరించి, తెలంగాణ స్టేట్‌ డయాగ్నస్టిక్స్‌లో పరీక్షలు చేయిస్తున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. బస్తీ దవాఖానాల్లో గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు అవసరమైన మందులు తదితర సేవలందిస్తారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, బీపీ, షుగర్, వంటి పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా ఎవరికైనా పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే అక్కడకు సిఫార్సు చేస్తారు. దాదాపు 150 రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతి దవాఖానాలోనూ డాక్టరు, నర్సు, పారామెడికల్‌ సిబ్బంది ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇవి తెరిచి ఉంటాయని, పైసా ఖర్చు లేకుండా పేదలకు వైద్యసేవలు అందుతాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మల్లాపూర్‌ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవలు పెంచుతామన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని సుల్తాన్‌నగర్, యాదగిరిన గర్‌లలో బస్తీ దవాఖానాలను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.  

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని వెంకటేశ్వరనగర్‌ బస్తీలో, ఎన్బీనగర్‌ బస్తీలో మంత్రి ఈటల రాజేందర్‌ బస్తీ దవాఖానాలను ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు.   
కాప్రా సాయిరాంనగర్‌లో బస్తీ దవాఖానాను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు స్వర్ణరాజ్, పావనీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌వీనగర్‌లోని బస్తీ దవాఖానాను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితారాణా, కార్పొరేటర్లు దేవేందర్‌రెడ్డి, గొల్లూరి అంజయ్య పాల్గొన్నారు.  
కవాడిగూడ డివిజన్‌ రోజ్‌కాలనీ, భోలక్‌పూర్‌ డివిజన్‌ దామోదర సంజీవయ్యనగర్‌లలో బస్తీ దవాఖానాలను డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
కుషాయిగూడ మహిళా భవన్‌లోని బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డితో కలిసి గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు. జెడ్సీ ఉపేందర్‌రెడ్డి, కాప్రా సర్కిల్‌ డీసీ శైలజ, కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, పన్నాల దేవేందర్‌రెడ్డి, కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్, బొంతు శ్రీదేవి పాల్గొన్నారు.  
కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని చింతల్‌ డివిజన్‌ భగత్‌íసింగ్‌నగర్, రంగారెడ్డినగర్‌ డివిజన్‌ నందానగర్, కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ ద్వారకానగర్‌లలో ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నవీన్‌కుమార్, ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి బస్తీ దవాఖానాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, జోనల్‌ కమిషనర్‌ మమత తదితరులు పాల్గొన్నారు.
కామాటిపురాలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుధ, కార్పొరేటర్‌ ముఖేష్‌సింగ్‌ కలిసి బస్తీ దవాఖానాను ప్రారంభించారు.   
సంతోష్‌నగర్‌ డివిజన్‌ కళంధర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో బస్తీ దవాఖానాను రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ, యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీతో కలిసి ప్రారంభించారు.
సైదాబాద్‌ డివిజన్‌ జాకీర్‌ హుస్సేన్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో బస్తీ దవాఖానాను హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల, స్థానిక కార్పొరేటర్‌ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి పాల్గొన్నారు.  
అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని తుర్కపల్లిలోని మోడల్‌ మార్కెట్‌ కాంప్లెక్స్, అల్వాల్‌ డివిజన్‌లోని అరుంధతి సంఘం కుమ్మరి బస్తీ, వెంకటాపురం డివిజన్‌లోని కొత్తబస్తీలలోని బస్తీ దవాఖానాలను ఎమ్మెల్యే మైనంపల్లి ప్రారంభించారు.   
మోండా మార్కెట్‌ డివిజన్‌ చేపల బావిలో బస్తీ దవాఖానాను స్థానిక కార్పొరేటర్‌ ఆకుల రూపతో కలిసి ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమీషనర్‌ ముకుందరెడ్డి పాల్గొన్నారు.  
కేపీహెచ్‌బీ డివిజన్‌లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, జెడ్సీ మమతతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీలోని 4వ ఫేజ్‌లో బస్తీ దవాఖానాను ప్రారంభించారు.   
వివేకానందనగర్‌ డివిజన్‌ వెంకటేశ్వరనగర్‌లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, జెడ్‌సీ మమతతో కలిసి బస్తీ దవాఖానాను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.  
కొండాపూర్‌ డివిజన్‌ ప్రేమ్‌నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో బస్తీ దవాఖానాను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ప్రారంభించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement