వర్ని(బాన్సువాడ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం పలు పథకాలు తెస్తుంటే వ్యవసాయ సిబ్బంది సరిగా పని చేయడం లేదని మండిపడ్డారు. వర్నిలో మంగళవారం రాత్రి నిర్వహించిన వర్ని, కోటగిరి, రుద్రూర్ మండలాల రైతుల సమన్వయ సమితి సభ్యుల సదస్సులో ఆయన మాట్లాడారు. అసంఘటిత రైతు శక్తిని సంఘటితం చేయడానికే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామన్నారు.
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. రబీ ప్రణాళిక సిద్ధం చేసి మంచి దిగుబడులు ఇచ్చే విత్తనాలు తెప్పించి రైతులకు అందజేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్య లేదని, రైతులు కోరితే 24 గంటలు సరాఫరా చేస్తామని, వచ్చే ఏడాది నుంచి రెండు పంటలకు సాగు నీరందిస్తామన్నారు. ఈ రబీలో వరి నారు మళ్లు డిసెంబర్ 15 లోపు పూర్తి చేసుకుని నాట్లు వేయాలని సూచించారు. సకాలంలో నాట్లు వేస్తే వడగళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్, ఏఎంసీ చైర్మన్ గంగారాం, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి , సమితి మండల కన్వీనర్లు ఇందూర్ సాయులు, పిట్ల శ్రీరాములు పాల్గొన్నారు.
ఇష్టం లేకుంటే వెళ్లిపోండి..
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుంటే సిబ్బంది పనితీరు అధ్వానంగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఉండి సలహాలివ్వాలని ఐదు వేల ఎకరాలకు ఒక అధికారిని నియమిస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాగైతే లాభం లేదని, సక్రమంగా పని చేయడం చేతకాని వాళ్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలని, వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించుకుంటామని స్పష్టం చేశారు. సమితి సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని మందలించారు. కొందరు సభ్యులు గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment