
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరిట దళారులు కొనసాగిస్తున్న దందాపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నియోజకవర్గమైన బాన్సువాడలో దందా జరుగుతుండడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. వివరాలు.. గత కొంతకాలంగా బాన్సువాడ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పేరుతో డబుల్ బెడ్‌రూం ఇండ్లపై నకిలీ పట్టాలు తయారీ చేస్తున్నట్లు సమాచారం అందింది. బాన్సువాడ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ పట్టాల బాగోతం బయటపడింది. పేదల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ పట్టాలను అంటగట్టి వారిని నిలువునా మోసం చేస్తున్నట్లు తేలింది. దీనిపై వెంటనే సమగ్ర విచారణ విచారణ జరిపి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.