Telangana: అక్కడ 3 భాషలు వస్తేనే ఎన్నికల్లో గెలుపు | Jukkal and Banswada Segments Become A Fusion of Different Cultures | Sakshi
Sakshi News home page

Telangana: అక్కడ 3 భాషలు వస్తేనే ఎన్నికల్లో గెలుపు

Published Mon, Nov 1 2021 8:40 PM | Last Updated on Mon, Nov 1 2021 9:31 PM

Jukkal and Banswada Segments Become A Fusion of Different Cultures - Sakshi

బాన్సువాడ: ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ రాకతో ప్రపంచంలో సాంకేతిక విప్లవం వచ్చింది. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న సాంకేతిక విప్లవం ప్రజల జీవన విధానాలను పూర్తిగా మార్చేసింది. పట్టణాల్లో ప్రజలు ఆనాదిగా వస్తున్న కట్టుబాట్లను ఛేదించి, కొత్త రకం ఫ్యాషన్లు, విహాంగ వీక్షణం చేస్తున్నారు.  పల్లెపల్లెలో కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు విస్తరిస్తున్నాయి. భాష, వేషాధారణ మారుతోంది. అయితే కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో  మాత్రం తరతరాలుగా వస్తున్న కట్టుబాట్లనే అనుసరిస్తున్నారు అక్కడి ప్రజలు.  వారి జీవన విధానంలో ఏ మాత్రం మార్పు రాలేదు.  

ఈ తరం యువతీ, యువకులు ఆధునిక పోకడలకు వెళ్తుండగా, వారి తల్లిదండ్రులు, తాత, నానమ్మలు మాత్రం పాత కాలం నాటి సంస్కృతి, వేషాధారణే అనుకరిస్తున్నారు.  ఆ కాలం నాటి రవాణా సౌకర్యాలనే నేటికీ వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దులో ఉన్న మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, కోటగిరి, బీర్కూర్‌ ప్రాంతాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తారు.  ఇక్కడ మరాఠి, కన్నడ, తెలుగు భాషలకు మాట్లాడే వారు  కనిపిస్తారు. మూడు భాషలు మాట్లాడుతున్నందున ఈ ప్రాంతాన్ని త్రిభాషా సంగమంగా చెప్పవచ్చు. 

రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటైన జుక్కల్, బాన్సువాడ సెగ్మెంట్లు విభిన్న సంస్కృతులకు సమ్మేళనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణకు ముందు నిజామాబాద్, నాందేడ్, బీదర్‌ జిల్లాలు నిజాం సర్కార్‌ పాలిత రాష్ట్రమైన దక్కన్‌లో ఉండేవి.  తర్వాత విడిపోయి నిజామాబాద్‌ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో, నాందేడ్‌ జిల్లా మహారాష్ట్రలో, బీదర్‌ జిల్లా కర్ణాటకలో కలిసాయి. ఈ మూడు జిల్లాలు కలిసి ఉండడం వల్ల  మూడు భాషలను మాట్లాడే వారు ఇక్కడ ఉన్నారు.  

70 శాతం ప్రజలకు ఫ్రిజ్‌లంటే తెలియదు
జుక్కల్‌ సెగ్మెంట్‌లో నివసించే ప్రజల ఆచార, వ్యవహారాలు, మిగితా ప్రాంతాలతో పోల్చితే భిన్నంగా ఉంటాయి.  ఇక్కడ   నేటికీ జొన్న రొట్టె అంటేనే వారికి ప్రీతి. జొన్న రొట్టే, మినప్పప్పు, కంది పప్పుతో భుజిస్తేనే వారికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. గ్రామాల్లో పెద్ద పెద్ద ఇండ్లు ఉండడం, ఆ ఇండ్ల ఎదుట ఉండే వాకిలిపై సాన్పు వేయడం,  ఒక గదిని పూర్తిగా ధాన్యాగారంగా ఉంచడం, ఇండ్లలో నెలల తరబడి ఫ్యాన్లు వినియోగించకపోవడం చూడవచ్చు. సుమారు 70 శాతం ప్రజలకు ఫ్రిజ్‌లంటే తెలియదు. 

గుర్రాలు, ఒంటెలు వారికి రవాణా సాధనాలు
ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ ఇంకా మెరుగు పడకపోవడంతో గాడిదలు, ఒంటెలు, గుర్రాలను ప్రయాణ సాధనాలుగా ఉపయోగిస్తారు.  మద్నూర్, బిచ్కుంద, జుక్కల్‌ మండలాల్లోని మారు మూల గ్రామాల్లో రవాణా ఇప్పటికీ గుర్రాలు, ఒంటెలపై సాగడం జరుగుతోంది. కాలినడకన ఊర్లు దాటుతారు.  ఆనాటి నుంచి వస్తున్న ఈ సాంప్రదాయం మారుమూల ప్రాంత గ్రామాల్లో కనిపిస్తుంది. మద్నూర్‌లో పత్తి వ్యాపారం కొనసాగుతుంది. పత్తిని జిన్నింగ్‌ మిల్లులకు తరలించడానికి, మారుమూల గ్రామాల ప్రజలతో పాటు మహారాష్ట్ర ప్రాంత వాసులు ఒంటెలపై తీసుకురావడం ఇప్పటికీ కనిపిస్తోంది.  

వృద్ధులను ఆసుపత్రులకు చికిత్సల కోసం గుర్రాలు, గాడిదలు, దున్నపోతులపై గ్రామాల ప్రజలు తీసుకువచ్చే దృశ్యాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.  ధాన్యం తరలింపునకు నేటికి గాడిదలను వినియోగిస్తారు. బాన్సువాడ, బీర్కూర్, జుక్కల్, మద్నూర్‌ తదితర ప్రాంతాల్లో  వానాకాలం, యాసంగి సీజన్‌లలో వందల సంఖ్యలో గాడిదలు మహారాష్ట్ర నుంచి తీసుకువస్తారు. ధాన్యం మోసినందుకు వారికి డబ్బులు ఇవ్వకుండా కొంత ధాన్యం ఇస్తారు. 

మూడు భాషలు వస్తేనే ఎన్నికల్లో గెలుపు
అలాగే జుక్కల్‌ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యేగాను, ఎంపిపి, జడ్పీటిసిలుగా పోటీ చేసే వారికి మూడు భాషలు వస్తేనే ఎన్నికల్లో గెలుపొందుతారని తెలుస్తోంది.  ఇక్కడ తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, కన్నడి భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషలను అనర్గళంగా మాట్లాడే నేతలను ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు.  మాజీ ఎమ్మెల్యే గంగారాం, ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేలకు ఈ మూడు భాషలు రావడం వల్లే వారు ప్రజల్లో దూసుకెళ్తున్నారు. గత 1999లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మె ల్యేగా పోటీ చేసిన డి.రాజేశ్వర్‌కు తెలుగు తప్పా మిగితా భాషలు రానందువల్లే ఆయన ఎన్నికల్లో గెలుపొందలేకపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ నాలుగు భాషలను మాట్లాడేవారు మాత్రమే గెలుస్తారని వారు పేర్కొంటున్నారు. 

వేషాధారణలోనూ ప్రత్యేకతే
అలాగే ఈ ప్రాంత ప్రజలు, ధోతీలు, కుర్తాలను అధికంగా ధరిస్తారు. నేడు జీన్స్, టీషర్ట్స్‌ వచ్చినా, వాటిని ధరించకుండా పాత కాలం నాటి దుస్తులను మాత్రమే ధరించడం విశేషం. మహిళలు ఖాదీ చీరలను, జాకెట్లను ధరిస్తారు.  మగవారు తలపై పాగ ధరించడం, భుజంపై టవల్‌ వేసుకొని చేతిలో రేడియో తీసుకొని గ్రామంలో తిరుగుతుంటారు. ఇప్పటికీ ఇక్కడ పటేల్, పట్వారీలుగా ఒకరినొకరు సంబోధించుకొంటారు. గ్రామానికి పెద్ద మనిషి ఉండి, అతను ఇచ్చే ఆదేశాలను పాటించడం నేటికీ కనిపిస్తుంది. గిరిజనులు తీజ్‌ ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్వాడీలు ప్రత్యేక పండగలను నిర్వహిస్తారు. 

చారిత్రాత్మక ప్రాంతం ఇది 
కౌలాస్‌ రాజులు పాలించిన ప్రాంతం జుక్కల్, బాన్సువాడ సెగ్మెంట్లు.  అందుకే ఇక్కడి అనేక గ్రామాల్లో బురుజులు, చిన్న చిన్న పురాతన కట్టడాలు కనిపిస్తాయి.  ఆ నాడు పటేళ్ళుగా ఉన్న వారిని నేటికీ ఎంతో ఆదరిస్తారు. జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి మండల కేంద్రాల్లో పురాతన బురుజులు ఉన్నాయి.   మద్నూర్‌ మండల కేంద్రంలో ఎల్లమ్మగల్లి ప్రాంతంలో ఇప్పటికీ అప్పటి కాలం నాటి బురుజులు పెద్ద ఎత్తున ఉండడం చరిత్రకు నిదర్శనంగా చెప్పవచ్చు.
 

మద్నూర్‌ మండల కేంద్రంలో అప్పట్లో పెద్ద జైళ్ళు ఉండేవని పెద్దలు చెబుతూ ఉంటారు. రాజు పరిపాలనలో తప్పు చేసిన వారిని జైలుకు తరలించే వారని, పెద్ద గోడలు చుట్టుపక్కల ఉండేవని వారు తెలిపారు. రానురాను ఈ బురుజులు కూలిపోతున్నాయి. బాన్సువాడ, మద్నూర్‌లు పాత తాలూకా కేంద్రాలుగా ఉండడంతో ఇప్పటికీ ఇక్కడి తహసిల్దార్‌ కార్యాలయాలు చరిత్రకు సాక్షిగా నిలిచాయి. బాన్సువాడ సమీపంలో ఉన్న సోమలింగేశ్వర ఆలయం ఎంతో చారిత్రాత్మకమైన ఆలయం. 

మరాఠీ మీడియంలో విద్యాబోధనలు
ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లే ని విధంగా మద్నూర్‌ మండలంలో మరాఠీ మీడియం పాఠశాలలు ఉండడం విశేషంగా చెప్పవచ్చు. మద్నూర్‌ మండలంలో అప్పట్లో మహారాష్ట్రలో ఉండేది. మరాఠీ భాషలో మాట్లాడే వారు ఇక్కడ అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఇక్కడ మరాఠీ మీడియం పాఠశాలలను కొనసాగిస్తోంది. మిర్జాపూర్, చిన్నశక్కర్గ, కేలూర్, తడిహిప్పర్గ గ్రామాల్లోనూ మరాఠి మీడియం పాఠశాలలు ఉన్నాయి. 
ఇక్కడి సంస్కృతి విభిన్నం: అనీత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, మద్నూర్‌
రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ మండలాల్లో ఆచార, వ్యవహారాలు, సంస్కృతి విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ వివాహాది శుభ కార్యాలు మరాఠా సంస్కృతిలో చేస్తారు. ఇక్కడి ప్రజలు అందరితో కలుపుగోలుగా ఉంటారు. గ్రామాల్లో ఎంతో ఉత్సాహంగా బంధువులను ఆహ్వానిస్తారు. ప్రతీ ఒక్కరితో కలుపుగోలుగా ఉంటారు. 

మత సామరస్యానికి ప్రతీక ఈ ప్రాంతం: తుకారాం మరాఠా, ఆవల్‌గావ్, మద్నూర్‌
ఇక్కడ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, మరాఠాలు, మార్వాడీలు అనే భేదం ఉండదు. అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటారు. బంధు వరసలతో మాట్లాడుకుంటారు. మరాఠాలు, తెలుగు వాళ్ళనే భేదం ఉండదు. అందరం కలిసి ఉంటాం. 

మరాఠీ మీడియంలో చదువుతారు: శివ శంకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మద్నూర్‌
ఇక్కడ తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, కన్నడ భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మరాఠీ మీడియం స్కూళ్ళు కూడా ఉన్నాయి. హిందీ భాష ప్రతీ ఒక్కరికి వస్తుంది. తెలుగు మాట్లాడడం కంటే మరాఠీయే ఎక్కువగా మాట్లాడుతారు.  దగ్గర్లోనే దెగ్లూర్‌ పట్టణం ఉన్నందున అక్కడికే వెళ్ళి షాపింగ్‌ చేస్తారు. 

పల్లెల్లో మార్పు వస్తోంది: దశరథ్, మద్నూర్‌
గ్రామాల్లో ఇప్పుడిప్పుడే యువతలో మార్పు వస్తోంది. మా తరం వారు మాత్రం మారడం లేదు. అవే పాత ఆచార వ్యవహారాలు ఉంటాయి. స్మార్ట్‌ ఫోన్లంటే చాలా మందికి తెలియదు. చిన్న చిన్న ఫోన్లే వాడుతున్నాం. టీవీలు, రేడియోలు గ్రామాల్లో ఉన్నాయి.  ఇక్కడ ఇంకా రవాణా వ్యవస్థ మెరుగుపడాల్సి ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement