
కేసీఆర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: రైతు శ్రేయస్తే తమ ధ్యేయమంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బీమా’ పథకం మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ‘రైతు బంధు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్’ పేరుతో పథకం అమలు చేయనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి అమలు కానున్న రైతు బీమా పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. జీఎస్టీతో కలిపి ఏడాదికి 2,271 రూపాయలను రైతుల పేరిట ప్రభుత్వం జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)కి చెల్లిస్తుంది. రైతు చనిపోతే నష్టపరిహారంగా 5 లక్షల రూపాయలను బీమా సంస్థ బాధిత కుటుంబానికి అందిస్తుంది.