గులాబీ.. గుబాళింపు | TRS Leaders And Congress Leaders Nalgonda | Sakshi
Sakshi News home page

గులాబీ.. గుబాళింపు

Published Fri, Dec 28 2018 9:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS Leaders And Congress Leaders Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్‌ నేత, నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యతో (జనవరి) మొదలైన ఏడాది, శాసన సభకు జరిగిన ముందస్తు ఎన్నికలతో (డిసెంబరు) ముగిసింది. ఈ ఏడాది కాలంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శాసన సభ ఎన్నికలు, ఆ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు ఉనికి కోల్పోవడం, తొలి సారి వామపక్ష పార్టీలకు చెందిన ఒక్క అభ్యర్థీ శాసన సభకు వెళ్లకపోవడం, రెండు దశాబ్దాలపాటు జిల్లాలో తిరుగులేని రాజకీయాలు నడిపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన టీడీపీ ఈ సారి కనీసం పోటీ చేయక పోవడం వంటి అంశాలు మాత్రమే..

టీఆర్‌ఎస్‌ జోష్‌
గతంలో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిన టీఆర్‌ఎస్‌ 2014 ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలను గెలిచినా, నల్లగొండ జిల్లాలో కేవలం నకిరేకల్, మునుగోడు స్థానాలకే పరిమితమైంది. కానీ, ఈసారి ఎన్నికల్లో (2018) ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాలకు  ఏకంగా తొమ్మిది స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. ఇక, నల్లగొండ జిల్లా విషయానికి వచ్చే సరికి రెండు స్థానాల సంఖ్యను నాలుగుకు పెంచుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన మునుగోడు, నకిరేకల్‌ను కోల్పోయి, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండల్లో విజయం సాధించి, తమ పూర్తి స్థాయి పట్టును నిరూపించుకుంది. ఇక, ఈ ఏడాదిలో ఆ పార్టీ చివరి మూడు నెలల కాలాన్ని పూర్తిగా ఎన్నికల కోసమే కేటాయించింది.

సెప్టెంబరు 6వ తేదీన ప్రభుత్వం రద్దు కావడం, ఆ రోజే అభ్యర్థులను ప్రకటించుకుంది. దీంతో జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ ఏకంగా పదిమంది అభ్యర్థులను ప్రకటించి హుజూర్‌నగర్, కోదాడ స్థానాలను పెండింగ్‌లో పెట్టి ఆ తర్వాత ప్రకటించుకుంది. తమను నమ్మి కాంగ్రెస్, సీపీఐల నుంచి ఎమ్మెల్యే హోదాలో వచ్చిన భాస్కర్‌రావు, రవీంద్ర కుమార్‌లకు తిరిగి టికెట్లు ఇచ్చి గెలిపించుకుంది. ఎప్పటి నుంచో తమను ఊరిస్తున్న నల్లగొండ జిల్లా కేంద్రాన్ని ఈ సారి కైవసం చేసుకుంది. పార్టీ సంస్థాగతంగా చేపట్టిన కార్యక్రమాలు ఏమీ లేవు. కేవలం ఎన్నికల వ్యూహంతోనే ఆ పార్టీ ప్రభుత్వం తరపున వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చింది. పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులు లక్ష్యంగా పనిచేసి వారి ఓట్లను కొల్లగొట్టి విజయాలు సాధించింది.
 
గట్టెక్కని కాంగ్రెస్‌ సీనియర్లు
ఒక విధంగా నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ ఉనికి నామమాత్రమైంది. ఆ పార్టీ సీనియర్లు ఈ సారి గట్టెక్కలేక పోయారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సారి ఓటమి పాలయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా పదవిలో ఉండి కాంగ్రెస్‌ తరపున దేవరకొండలో పోటీ చేసిన బాలూనాయక్‌ గెలుపు గట్టును చేరుకోలేక పోయారు. ఎమ్మెల్సీగా ఉండి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో, చిరుమర్తి లింగయ్య నకిరేకల్‌లో విజయం సాధించారు.

 జనవరిలో నల్లగొండలో జరిగిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా జిల్లాకు వచ్చింది. కాంగ్రెస్‌ కూడా సంస్థాగతంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ముందస్తు ఎన్నికల సమాచారం ముందే ఉండడంతో కాంగ్రెస్‌ నాయకత్వం కూడా ఎన్నికల కోణంలోనే పనిచేసింది. నల్లగొండ ఎమ్మెల్యేగా ఉండి, సీఎల్పీ ఉప నేతగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో కొన్నాళ్ల పాటు ఆ అంశంపై ఆందోళనలు చేసింది. దాదాపు ఏడాది కాలం పాటు కోమటిరెడ్డి ఎమ్మెల్యే హోదాకు దూరమయ్యారు. ఇక, ముందస్తు ఎన్నికల్లో మిర్యాలగూడెం స్థానం విషయంలో తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో చర్చనీయాంశం అ య్యింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యను ఇక్కడి నుంచి పోటీకి పెట్టి చేతులు కాల్చుకుంది.

టీడీపీ తెరమరుగు..
జిల్లాలో తిరుగులేని రాజకీయం నడిపిన తెలుగుదేశం పార్టీ చివరకు జిల్లాలో తెరమరుగు అయినట్లే కనిపించింది. ఈ ఏడాది కాలంలో చెప్పుకోదగిని కార్యక్రమాలు ఏవీ చేపట్టకపోయినా, వరస వలసతో చిక్కి శల్యమైంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ కనీసం ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేకపోయింది. అత్యంత ప్రధానంగా భావించే శాసన సభ ఎన్నికల్లోనూ ఆపార్టీ అభ్యర్థులు ఎవరూ రంగంలో లేకపోవడంతో కేడర్‌ అంతా ఎవరి దారి వారు చూసుకుని ఆయా పార్టీల్లో చేరిపోయారు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పార్టీ గుర్తుపై పోటీ చేస్తుందా లేదా అన్న అనుమానాలకు తావిచ్చింది. మొత్తంగా ఈ ఏడాదిలో టీడీపీ తెరుమరుగు కావడం ఒక్కటే కీలకమైన పరిణామం.

నెరవేరని వామపక్షాల లక్ష్యం
బహుజన లెఫ్ట్‌ ప్రంట్‌ ద్వారా కొత్త రాజకీయాలకు తెరతీయాలని భావించిన సీపీఎం లక్ష్యం నెరవేరలేదు. పార్టీ జెండా కింద చేపట్టే వివిధ ఆందోళన కార్యక్రమాలు, అనుబంధ సంఘాల కార్యక్రమాలు మినహా, సీపీఎం ఈ సారి ఎన్నికల్లో బొక్కాబోర్లా పడింది. గతంలో మాదిరిగానే, జిల్లాలో ఒక్క చోటా గెలవలేకపోయింది. తిరుగులేని విజయాలు సాధించిన నకిరేకల్‌ కానీ, అత్యధిక సంఖ్యలో విజయాలున్న మిర్యాలగూడెంలో కానీ ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఇక, సీపీఎం తరపున కాకుండా, బీఎల్‌ఎఫ్‌ పేర పోటీ చేసిన నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగానే కనిపించింది.

మరో వామపక్ష పార్టీ సీపీఐ ఉన్నొక్క స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీ కనీసం ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేక పోయింది. దీంతో మునుగోడు, దేవరకొండలో పార్టీకి పట్టున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో దేవరకొండలో గెలిచిన సీపీఐ ఈ సారి పోటీకూడా చేయలేదు. గతంలో దాదాపు ప్రతీ శాసన సభలో సీపీఎం, సీపీఐల నుంచి కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా ఉండే వారు. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేకుండా పోయింది. సీపీఎం కొన్ని స్థానాల్లో పోటీ చేసినా గెలవకపోగా, సీపీఐ కనీసం పోటీ కూడా చేయలేక పోయింది. దీంతో వామపక్షాలు తమ గత ప్రాభవాన్ని కోల్పోయినట్లు అయ్యింది.  

ఉనికి చాటని బీజేపీ
జిల్లాలో బీజేపీని బలమైన పార్టీగా నిలబట్టే ప్రయత్నాలేవీ నాయకత్వం నుంచి పెద్దగా జరగలేదు. సంస్థాగత కార్యక్రమాలను మినహాయిస్తే... ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అన్ని స్థానాల్లో నిలబడినా, ఎక్కడా డిపాజిట్‌ రాలేదు. మునుగోడు స్థానంపై ఆశపెట్టుకున్న పార్టీ నాయకత్వం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో బహిరంగ సభ పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. నాగార్జున సాగర్‌లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నా«థ్‌ సింఘ్‌ పర్యటించారు. ఎన్నికల సందర్భంగా జాతీయ నాయకత్వం జిల్లాలో పర్యటించి వెళ్లినా, ఆ పార్టీ ఎన్నికల్లో పెద్దగా ఉనికిని చాటలేక పోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement