వరంగల్ నగరంలో డివిజన్ అధ్యక్ష పదవి దక్కలేదని మనస్తాపం చెందిన ఒక టీఆర్‌ఎస్ నేత శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు.
కరీమాబాద్ : వరంగల్ నగరంలో డివిజన్ అధ్యక్ష పదవి దక్కలేదని మనస్తాపం చెందిన ఒక టీఆర్‌ఎస్ నేత శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల ప్రకారం..కరీమాబాద్‌లో 14వ డివిజన్ బూత్ కమిటీ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఇందులో 176వ బూత్ కమిటీ అధ్యక్ష పదవిని స్థానిక నేత గోకారపు రఘుపతి ఆశించాడు. కానీ ఆ పదవి ఓ మహిళా నేతకు ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రఘుపతి కరీమాబాద్ సుభాష్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.
స్థానికులు అడ్డుకుని నచ్చజెప్పారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తాను క్రియాశీలకంగా పార్టీలో పనిచేస్తున్నా వివక్ష చూపుతున్నారని రఘుపతి చెబుతున్నాడు. ఎన్నికల పరిశీలకుల ముందే తనపై కొందరు దాడికి యత్నించారని అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పాడు.