
సమావేశంలో మాట్లాడుతున్న శంకరమ్మ
సాక్షి,హుజూర్‌నగర్ : నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు నాదేనని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాసోజు శంకరమ్మ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలకు అండగా ఉంటూ విశేషంగా కృషి చేశానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ పట్ల ప్రజాదరణ పెరిగేలా చొరవ చూపడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తనకు టికెట్ విషయంలో తప్పక ఆలోచన చేస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి అండతో పార్టీలో కనీసం సభ్యత్వం లేని ఎన్‌ఆర్‌ఐ సైదిరెడ్డి తనకు టికెట్ వస్తుం దని, పార్టీ ఎన్నికల సామగ్రీ పంపిందని కార్యకర్తలకు చెపుతూ అయోమయానికి గురి చేస్తున్నాడన్నారు. అధిష్టానం ఎన్‌ఆర్‌ఐలకు టికెట్ కేటాయించాలనుకుంటే నియోజకవర్గానికి చెందిన ఏహెచ్‌ఆర్ ఫౌండేషన్ అధినేత అన్నెపురెడ్డి అప్పిరెడ్డికి టికెట్ కేటాయించాలని లేనిపక్షంలో సీనియర్ నాయకులు సాముల శివారెడ్డికి టికెట్ కేటాయించినా సమష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్న సైదిరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, ఎహెచ్‌ఆర్ ఫౌండేషన్ అధినేత అన్నెపురెడ్డి అప్పిరెడ్డి, స్థానిక నాయకులు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment