రేవంత్.. అసెంబ్లీకే కళంకం
సాక్షి, హైదరాబాద్: పచ్చిఅబద్దాలను చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభకే కళంకమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవా రం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం లో వారు విలేకరులతో మాట్లాడారు. మెట్రో రైలు భూములను ప్రభుత్వం తీసుకున్నదంటూ అబద్దాలు చెబుతున్న రేవంత్‌రెడ్డి దగ్గర వాస్తవాలుంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. అబద్దాలు చెబుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అప్రతిష్ఠ పాల్జేయాలని కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. డీఎల్‌ఎఫ్ భూములకు సంబంధించిన పూర్తి ఫైలును ప్రభుత్వం సభముందు పెట్టిందన్నారు. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం గతంలో ఏనాడూ లేదన్నారు.
ఆ భూములపై ప్రశ్నించలేదేం?
రేవంత్‌రెడ్డి లాంటి నాయకుడు మహబూబ్‌నగర్‌లో చెడబుట్టాడని జూపల్లి కృష్ణారావు విమర్శిం చారు. రేవంత్‌ను ఎందుకు గెలిపించినమా అని ప్రజలు సిగ్గుపడే పరిస్థితిని తెస్తున్నాడన్నారు. గత ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులకు కేసీఆర్‌ను బాధ్యునిగా చేసి విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. బిల్లీరావుకు, రహేజాకు, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు చంద్రబాబు వేలకోట్ల రూపాయల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. తెలంగాణ తిండి తింటూ, బట్టకడుతూ, ఇక్కడి ప్రజల ఓట్లతోగెలిచి బాబు మాటలను మాట్లాడితే ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు.
రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదు
ఎన్నో త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సహకరించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి విమర్శించారు. డీఎల్‌ఎఫ్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. అవినీతిని చంద్రబాబు చట్టబద్దం చేశాడన్నారు. రేవంత్‌రెడ్డి మాటలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా చంద్రబాబునాయుడే చేస్తున్నాడని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. సంక్షేమంపై జరుగుతున్న చర్చను పట్టించుకోకుండా వాకౌట్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బాధ్యతారహితం గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.