
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు 17న ప్రొటెం స్పీకర్‌ఎన్నిక, 19న గవర్నర్ ప్రసంగం రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపై ఊహాగానాలు పాలమూరు నుంచిఅవకాశం దక్కేదెవరికో? ప్రచారంలో సింగిరెడ్డినిరంజన్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి,శ్రీనివాస్‌గౌడ్ పేర్లు
సాక్షి, వనపర్తి : తెలంగాణ కొత్త శాసనసభ కొలుదీరే సమయం ఆసన్నమైంది. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మంత్రి పదవికి ఎవరికి వస్తుందనే చర్చ అంతటా సాగుతోంది. ఈనెల 16వ తేదీన తాత్కాలిక స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆయన 17న అసెంబ్లీని సమావేశపరిచి ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 19న శాసనసభ, శాసనమండలి సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. 20న ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనుండటంతో ఆ లోగానే మొదటి విడత మంత్రి వర్గవిస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. మొదటి విడతలో 8 మందికి చోటు కల్పిస్తారని, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కేబినెట్ పదవి ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అడ్డంకి లేనట్లే
డిసెంబర్ 7న ఎన్నికలు జరగగా, 11న ఫలితాలు వెలువడిన అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఫలితాలు వెలువడి 25 రోజులు గడిచినా ఇప్పటికీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో శాసనసభ కొలువుదీరలేదు. దీనికితోడు మంత్రివర్గ విస్తరణ సైతం చేపట్టలేదు. ఇటీవల పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి అడ్డుపడుతుందని అంతా భావించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళితో ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం చేయడంతో సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా..
గత పాలకవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డిని మంత్రి పదవులు వరించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు ఓటమి చెందడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఒక్క కొల్లాపూర్ మినహా మిగతా అన్నిచోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులే భారీ మెజార్టీతో విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ సైతం మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు ఉన్నతస్థానం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరొందడంతో ఆయనకు తప్పనిసరిగా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం ఎన్నికల ఫలితాల నాటినుంచీ కొనసాగుతోంది. ఆయనతోపాటు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
బీసీ సామాజికవర్గం కలిసొచ్చేనా?
సామాజికవర్గాల పరంగా చూస్తే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన వి.శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. 2014లోనే ఆయన మంత్రి పదవి ఆశించినప్పటికీ కుదరలేదు. ఈసారి తప్పకుండా తన కల నెరవేరుతుందనే భావనలో ఆయన ఉన్నారు. ఈసారి కేసీఆర్ పాలకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తారని వార్తలు వినిపిస్తుండటంతో శ్రీనివాస్‌గౌడ్‌కు బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం సాగుతోంది.
పాలమూరుకు స్పీకర్ పదవి?
ఎమ్మెల్యేలు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నా తుది నిర్ణయం సీఎం కేసీఆర్‌దే కావడంతో ఆయన ఎవరికి అవకాశమిస్తారనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారెవరూ లేనందున కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికే అంతా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా, స్పీకర్ పదవి పలువురికి కలిసి రాకపోవడంతో ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు స్పీకర్ పదవి దక్కొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరో 10రోజులు ఆగక తప్పదు!