కువైట్ చేరుకున్న ఎంపీ కవిత
కువైట్: తెలంగాణ ప్రవాసీయులను కలవడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం కువైట్కు చేరుకున్నారు. కువైట్లో ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రవాసీ ప్రముఖులు వినయ్ కుమార్, పూర్ణచంద్రరావు, ఇమ్రానుద్దీన్ ఇమ్మూ తదితరులు కువైట్ విమానాశ్రయానికి వచ్చి ఆమెకు స్వాగతం పలికారు.
కువైట్ లోని వివిధ వర్గాల తెలంగాణ ప్రవాసీయులతో కవిత సమావేశం అయ్యేందుకు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లేబర్ క్యాంపులో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు కువైట్లోని భారతీయ రాయబారి సునిల్ జైన్తో సమావేశం అవుతారు. అనంతరం కేంబ్రిడ్జి పాఠశాలలో జరిగే సభలో పాల్గొంటారు.
శుక్రవారం బహ్రెయిన్లో జరుగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కవిత ముఖ్య అతిథిగా పాల్గొంటారని హరిప్రసాద్ తెలిపారు. ఈసా టౌన్లోని భారతీయ పాఠశాల మైదానంలో ఆ కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు.
తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులు ఈ రెండు దేశాల్లో పర్యటించటం ఇదే తొలిసారి. గతవారం కవిత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయి, అబుదబి నగరాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.