బెర్త ఎవరికో..
కేసీఆర్ కేబినెట్లో చోటుకు ఎమ్మెల్యేల ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ తొలి మంత్రివర్గంలో జిల్లా నుంచి ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం కొలువుదీరే సమయం దగ్గరపడుతుండడంతో చర్చ జోరందుకుంది. మంత్రి వర్గంలో చోటు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసుకున్నారు. ఇంతటితో ఆగకుండా టీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్‌రావు, కె.తారకరామారావు, కె.కవితతో ఎవరికివారుగా సిఫారసులు చేయించుకుంటున్నారు.
జిల్లాల వారీగా, సామాజిక సమీకరణ పరంగా, సీనియారిటీ ఆధారంగా తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించుకుంటున్నారు. తమ అనుకూలతను చెప్పుకోవడంతోపాటు జిల్లాలోని ఇతరులకు ప్రతికూలమైన అంశాలను వివరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజు నుంచి బిజీగా ఉన్న కేసీఆర్‌ను ఏదోరకంగా రెండు రోజులకు ఒకసారి కలిసి వస్తున్నారు. 12 అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లాలో టీఆర్ఎస్ ఏకంగా 8 స్థానాలను గెలుచుకుంది. గులాబీ దళానికి మొదటి నుంచి అనుకూలంగా ఉన్న జిల్లా కావడంతో మంత్రివర్గంలోనూ ఇదే స్థాయిలో ప్రాధాన్యం ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారుు. జిల్లా నుంచి కనీసం ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్నారుు. సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రుల సంఖ్య మూడు వరకు ఉంటుందని నాయకులు అంచనా వేస్తున్నారు.
ములుగు నుంచి గెలిచిన ఆజ్మీరా చందూలాల్‌కు మంత్రి పదవి ఖాయమని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గిరిజన వర్గం నుంచి సీనియర్ నేతగా ఉండడం ఆయనకు అనుకూలంగా మారింది. చందూలాల్‌కు గతంలోనే మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. లోక్‌సభ సభ్యుడిగా కూడా పని చేశారు. తెలంగాణలో గిరిజన శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని... ఇందులో చందులాల్ పేరు ఉంటుందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం కూడా చందూలాల్‌కు కలిసివచ్చే అంశమని ఆయన అనుచరులు చెబుతున్నారు.
జిల్లాలో టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. 2009లో జిల్లాలో టీఆర్ఎస్ తరఫున ఆయన ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 ఉప ఎన్నిక, తాజా ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత సాధారణ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం కష్టపడ్డారు. ఐదేళ్లుగా సాగిన ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మొదటి నుంచి విధేయుడిగా ఉండడం, ఇతర నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో మంచి సంబంధాలు ఉండడం వినయభాస్కర్కు అనుకూలంశాలుగా ఉన్నాయి.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి కీలక సమయంలో టీఆర్ఎస్లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. మారిన టీఆర్ఎస్ విధానం... దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నారుు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఈ వర్గానికి పెద్దపీట వేయనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాజయ్యకు సైతం సామాజికవర్గం అనుకూలంగా ఉంది. కేసీఆర్‌పై విమర్శలు చేసే జిల్లాకు చెందిన ఒక ఉద్యమ నేతను ఎదుర్కొనేందుకు రాజయ్యకు అవకాశం ఇస్తారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారుు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేతపై భారీ మెజారిటీతో విజయం సాధించిన కొండా సురేఖకు మహిళా కోటాలో మంత్రివర్గంలో చోటుదక్కుతుందని ప్రచారం జరుగుతోంది. వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంత్రివర్గంలో సురేఖకు అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేల్లో గతంలో మంత్రులుగా పని చేసిన వారు ఎవరూ లేకపోవడం, ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొనే విషయంలో మహిళా నేతగా ఉన్న గుర్తింపు సురేఖకు అనుకూలంశాలుగా ఉండనున్నాయి.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా ఉన్న సిరికొండ మధుసూదనాచారి మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ నేత కావడంతో కేసీఆర్‌తో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచి పార్టీలో ఉండడంతో తనకు అవకాశం ఇవ్వాలని మధుసూదనాచారి కోరుతున్నారు. బీసీ సామాజికవర్గం కావడంతో మంత్రివర్గంలో సిరికొండకు స్థానం ఉంటుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోత్ శంకర్‌నాయక్ మొదటిసారి గెలిచారు. మొదటిసారి గెలిచిన వారికి అవకాశాలు ఉంటాయా లేదా అనేది సందేహంగా మారింది. జిల్లాలోని సీనియర్లలో ఏ వర్గం వారికి మంత్రులుగా అవకాశం ఉంటుందనేదాన్ని బట్టి వీరికి పదవులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ విప్, ఇతర ముఖ్య పదవుల విషయంలో వీరి పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.