సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీనిపై చర్చ జరపాలంటూ పార్టీ లోక్‌సభా పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి బుధవారం వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్ సభ్యులు బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, నగేశ్, పసునూరి దయాకర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సీతారాం నాయక్ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.
ఈ అంశాన్ని లేవనెత్తేందుకు జీరో అవర్‌లో సమయం ఇస్తానని, సభ్యులు కూర్చోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేశారు. అయినా ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు.. కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలపై ఆందోళనకు దిగారు. దీంతో సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆందోళన సద్దుమణగకపోవడంతో స్పీకర్.. సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్ సభ్యులు మళ్లీ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.
ఈ సందర్భంలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఏదైనా చెప్పాలనుకుంటే మీ సీట్లలోకి వెళ్లాలి. మీ నాయకుడు గానీ, మీలో ఒకరు గానీ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాను. ఇలా వెల్ నుంచి కాదు.. మీ సీట్లకు వెళ్లండి’’అంటూ పదేపదే విజ్ఞప్తి చేశారు. దీంతో జితేందర్‌రెడ్డి తన స్థానం నుంచి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. పార్టీ ఎంపీలను వెనక్కు రావాలని పిలిచారు. అయితే సభ్యులెవరూ వెల్ నుంచి వెళ్లకపోవడంతో జితేందర్‌రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళనల మధ్య సభను స్పీకర్ మళ్లీ 2 గంటల వరకు వాయిదా వేశారు.
మా సహనానికీ హద్దుంటుంది
మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే.. టీఆర్‌ఎస్ సభ్యులు మళ్లీ ఆందోళన కొనసాగించారు. కాసేపటికి జితేందర్‌రెడ్డికి మాట్లాడే అవకాశం వచ్చింది. ‘‘సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. రాష్ట్రం విడిపోయి మూడున్నరేళ్లయ్యింది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఉమ్మడి హైకోర్టు విభజన జరగాలి. కానీ ఇంతవరకు జరగలేదు. దీనిపై ఇప్పటికి చాలాసార్లు హామీలు ఇచ్చారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా హామీ ఇచ్చారు. కానీ మూడున్నరేళ్లు గడచిపోయాయి. మా సహనం నశిస్తోంది. తెలంగాణ లాయర్లు ఆందోళన బాట పట్టారు. వారికి రావాల్సిన పదోన్నతులు రాలేదు. అన్యాయం జరిగింది. హైకోర్టు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి అర్థమే లేదు. అందువల్ల వెంటనే హైకోర్టును విభజించాలి. కేంద్ర న్యాయశాఖ మంత్రి వచ్చి దీనికి సమాధానం చెప్పాలి. నిర్దిష్ట కాలపరిమితి విధించాలి’’అని డిమాండ్ చేశారు.
న్యాయ మంత్రి దృష్టికి తీసుకెళ్తా
ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ సమాధానమిచ్చారు. ‘‘టీఆర్‌ఎస్ సభ్యులు లేవనెత్తిన అంశం చాలా ముఖ్యమైనది. అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉన్నాయి. వారి ఆందోళనను న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా. అందువల్ల వారిని కూర్చోవాలని కోరుతున్నా’’అని అన్నారు.
అయినా టీఆర్‌ఎస్ సభ్యులు సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. చివరగా న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలోకి వచ్చి.. ఈ అంశంపై గురువారం పూర్తి వివరాలతో ప్రకటన చేస్తానని, సభ్యుల సెంటిమెంట్‌ను అర్థం చేసుకున్నానని చెప్పారు. నిర్దిష్ట కాల వ్యవధిలోగా హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న స్పష్టమైన ప్రకటనతో రావాలని జితేందర్‌రెడ్డి కోరారు.
ఎందుకు జాప్యం చేస్తున్నట్టు?: ఎంపీ కవిత
ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బుధవారం మధ్యాహ్నం లోక్‌సభ వాయిదా పడిన సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. గతంలో ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని, భవనాలు లేవని సాకులు చెప్పారన్నారు. ఇప్పుడు సుప్రీంపై నెపం నెట్టే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment