ప్రత్యేక హైకోర్టుపై దద్దరిల్లిన లోక్‌సభ
* ప్రత్యేక హైకోర్టుపై టీడీపీ, టీఆర్‌ఎస్ ఎంపీల మధ్య వాగ్వాదం
* ‘కొందరి’ వల్లే విభజనలో తాత్సారమన్న టీఆర్‌ఎస్ సభ్యులు
* తెలంగాణను హైకోర్టు ద్వారా పాలించాలనుకుంటున్నారు: కవిత
* చంద్రబాబు, వెంకయ్యనాయుడుల పేర్లు ప్రస్తావించిన జితేందర్‌రెడ్డి
* టీఆర్‌ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వెంకయ్యనాయుడు
* ఇక్కడ లేనివారి పేర్లు ప్రస్తావించొద్దు.. రాజకీయం చేయొద్దని ఆగ్రహం
* హైకోర్టు ఏర్పాటు కోసం బాబుకు లేఖ రాశామన్న సదానందగౌడ
* చంద్రబాబు హైకోర్టుకు ఏర్పాట్లు చేశాకే తదుపరి చర్యలని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రత్యేక హైకోర్టు’ అంశంపై బుధవారం లోక్‌సభ దద్దరిల్లింది. టీఆర్‌ఎస్ ఎంపీల ఆరోపణలు.. టీడీపీ, టీఆర్‌ఎస్ ఎంపీల వాదోపవాదాలు, కేంద్ర మంత్రుల వివరణలతో కొద్దిసేపు తీవ్రస్థాయిలో గందరగోళం చోటుచేసుకుంది. హైకోర్టు విభజన జరుగకుండా కొందరు తాత్సారం చేయిస్తున్నారని, ‘వాళ్లు’ హైకోర్టు ద్వారా తెలంగాణను పాలించాలనుకుంటున్నారని టీఆర్‌ఎస్ ఎంపీలు ఆరోపించారు. ఇది రాజకీయ నిర్ణయమని పేర్కొంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల పేర్లను ప్రస్తావించారు.
దీంతో టీడీపీ సభ్యులు లేచి టీఆర్‌ఎస్ సభ్యులతో వాదనకు దిగారు. మరోవైపు తొలుత హైకోర్టు విభజన అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ చివరలో మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాక తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించడం గమనార్హం. ప్రత్యేకహైకోర్టు అంశంపై చర్చించేందుకు బుధవారం ఉదయం టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వగా... స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఏఎస్‌ఆర్ నాయక్, బాల్క సుమన్, బీబీ పాటిల్, నగేశ్, కొత్తా ప్రతాప్‌రెడ్డి ప్లకార్డులతో మౌన ప్రదర్శన ప్రారంభించారు.
అందులో కొత్తేం లేదు: ప్రత్యేక హైకోర్టు అంశంపై సదానందగౌడ ప్రకటన తరువాత జితేందర్‌రెడ్డి మాట్లాడారు. ‘‘మంత్రి ప్రకటనలో కొత్త విషయమేం లేదు. అయితే మీడియాలో, పత్రికల్లోనే కాకుండా అందరూ చెప్పేదేంటంటే చంద్రబాబు, వెంకయ్యనాయుడు’’ అంటూ ప్రస్తావించబోతుండగా.. స్పీకర్ జోక్యం చేసుకున్నారు. మీడియా విషయాలపై ఇక్కడ చర్చ సరికాదన్నారు. తాను చెప్పేది తప్పయితే రికార్డుల నుంచి తొలగించాలని జితేందర్‌రెడ్డి చెబుతుండగానే.. ‘ఇకపై మీరు మాట్లాడేది రికార్డులకు వెళ్లదు’ అని చెప్పారు. మళ్లీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేనేం చెప్పాలనుకున్నానంటే న్యాయమంత్రిపై ఉత్తుత్తి ఆరోపణలు చేస్తున్నారు’’ అని వివరణ ఇచ్చారు. ‘‘నిన్న కేంద్ర మంత్రి సమాధానం తరువాత మేమంతా అరుణ్ జైట్లీని కలిశాం. నిన్న మా సహచరుడు వినోద్ సభలో కూడా చెప్పారు. ఏపీ సచివాలయం హైదరాబాద్‌లోనే ఉంది. డీజీపీ ఇక్కడే ఉన్నారు. ఏసీబీ ఇక్కడే ఉంది. వారి సీఎం కూడా ఇక్కడే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ఒక విషయమైతే... హైకోర్టు ఇవ్వడం కూడా ముఖ్యమైన విషయం. ఇప్పుడు న్యాయమంత్రి రివ్యూ పిటిషన్ ఉందంటున్నారు.
అసలు అదెందుకు వేశారు? హైకోర్టుకు భవనాలను ఇస్తామని, పదేళ్లపాటు అన్ని వసతులు అందిస్తామని చెబుతూ వేసిన పిటిషన్ అది. మా సీఎం వాళ్లను బాగా చూసుకుంటారు. ఇప్పటివరకు కూడా హైదరాబాద్‌లో విద్వేషపూరిత నేరాలేవీ జరగలేదు. పార్లమెంటరీ మంత్రికి అభ్యం తరం లేనప్పుడు, హోం మంత్రి, ఆర్థిక మంత్రి, న్యాయమంత్రికి అభ్యంతరం లేనప్పుడు మరి తాత్సా రం ఎందుకు? ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు. కేవలం రాజ కీయపర నిర్ణయం. ఒక్కరాత్రిలో తీసుకునే నిర్ణయం. ఒకవేళ ఈరోజు కేబినెట్ సమావేశం జరిగితే ఆ నిర్ణయం తీసుకుంటే తేలిపోతుంది. మీరే చూస్తున్నారు. మీకు మేం ఇబ్బంది కల్గించడం లేదు. మేమే నిల్చొని మా బాధను మౌనంగా తెలుపుతున్నాం. అయినా నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరగా తేల్చాలని కోరుతున్నా’’ అని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
రాజకీయ అంశం: అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘రివ్యూ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వేసిందంటే.. న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వ పరిధిని చాలెంజ్ చేశారు. కేంద్రం వేయాల్సిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వేసింది. ఇదొక రాజకీయ అంశం.. (కవిత ఈ సందర్భంలో పలువురి పేర్లు ప్రస్తావించగా స్పీకర్ వాటిని రికార్డుల నుంచి తొలగించారు) వాళ్లు తెలంగాణను హైకోర్టు ద్వారా పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. దీనిపై స్పీకర్ జోక్యం చేసుకుంటూ ‘‘వాళ్ల పేర్లు ఉండకూడదు. ఎలాంటి ఆరోపణలు ఎవరిపైనా ఉండకూడదు. కవితా.. ఇది సరికాదు’’ అని సూచించారు. అనంతరం కవిత మాట్లాడుతుండగా.. మా నాయకుడి పేర్లు ఎలా ప్రస్తావిస్తారంటూ టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కె.రామ్మోహన్‌నాయుడు వాగ్వాదానికి దిగారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రతి వాదనకు దిగారు.
వెంకయ్య ఆగ్రహం: సదానందగౌడ సమాధానం తర్వాత బాల్క సుమన్ తదితర టీఆర్‌ఎస్ ఎంపీలు హైకోర్టు ఏర్పాటులో తాత్సారం వెనక కొందరు ఉన్నారంటూ వారి పేర్లను బిగ్గరగా చెప్పడంతో.. వెంకయ్యనాయుడు లేచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా దుష్పరిణామం. హైకోర్టు విభజనలో చాలా స్పష్టంగా ఉన్నాం. వినోద్.. మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వినే ఓపికా ఉండాలి. మీకు వినాలని లేకుంటే నేను వదిలేస్తాను. తాను చేసిన ప్రకటనను కూడా ఉపసంహరించుకోవాలని మా న్యాయమంత్రికి చెబుతా.. మీరు చేయాలనుకున్నది చేసుకోండి’’ అంటూ కూర్చున్నారు.
అనంతరం టీఆర్‌ఎస్ సభ్యులు తిరిగి పలు ఆరోపణలు చేయడంతో వెంకయ్య మళ్లీ లేచారు. ‘‘ఆ ప్రాంతం ఏంటి? ఈ ప్రాంతం ఏంటి? మాది ప్రాంతీయ పార్టీ కాదు. ఇక్కడ లేని వారి పేర్లను ప్రస్తావించవద్దు. హైకోర్టు ఏర్పాటుకు కొంత సమయం పడుతుందన్న విషయం మనం గ్రహించాలి. మీరిచ్చిన హామీలన్నీ 14 నెలల్లో నెరవేర్చలేదని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? ఏపీ హైకోర్టుకు సదుపాయాలు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటున్నందున ఈ అంశాన్ని కూడా హైకోర్టు ముందుంచాలని నేను మా న్యాయమంత్రిని కోరుతున్నా.. దీన్ని రాజకీయం చేయొద్దు’’ అంటూ మండిపడ్డారు. అనంతరం సదానందగౌడ మాట్లాడుతూ ‘‘ఏపీ హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరుతాం. అవి ఏర్పాటు కాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం..’’ అని చెప్పారు.
న్యాయస్థానం పరిధిలో ఉంది..
ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత ప్రత్యేక హైకోర్టు అంశంపై కేంద్ర న్యాయమంత్రి సదానందగౌడ ఒక ప్రకటన చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణకు చెందుతుంది, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలి. ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతంలో హైకోర్టుకు భవనాలు, న్యాయమూర్తులు, సిబ్బందికి నివాస గృహాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటుచేయాల్సి ఉంది. ఇది ఏపీ ప్రభుత్వ బాధ్యత. దీనిని ఉమ్మడి హైకోర్టుతో చర్చించి నెరవేర్చాల్సి ఉంది. హైకోర్టు, ఏపీ ప్రభుత్వం కలసి నిర్ణయించుకున్న తరువాత, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కేంద్రం తదుపరి చర్యల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రికి, హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు కేంద్రం ఇప్పటికే లేఖ రాసింది.
కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. దానిపై మే 1, 2015న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ పరిధిలో హైకోర్టు ఏర్పాటుకు తగిన ప్రాంతాన్ని గుర్తించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లోపు ఏపీ సీఎం, చీఫ్ జస్టిస్ కలసి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సమాచారం ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 14న ఉందని కూడా తెలిపారు. అందువల్ల ఈ అంశం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది..’’ అని సదానందగౌడ పేర్కొన్నారు.