
కమిటీలపై టీఆర్‌ఎస్ కొత్త విధానం
♦ రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు!
♦ ఏడు జిల్లాలకో పరిశీలకుని నియామకం
♦ నియోజకవర్గ కమిటీల్లో 20 నుంచి 24 మందికి అవకాశం
♦ ప్రతి జిల్లాకు ఇద్దరు ఇన్‌చార్జిలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత మార్పుచేర్పులకు కసరత్తు చేస్తోంది. రెండేళ్లుగా కమిటీలు లేకుండానే పార్టీ కార్య క్రమాలను నిర్వహించగా ఈ నెల 21న పార్టీ 16వ ప్లీనరీ సందర్భంగా వివిధ స్థాయిల్లో సంస్థాగత కమిటీలను నియమించే పనిలో అధిష్టానం మునిగిపోయింది. గురువారం నాటికే సభ్యత్వ నమోదు గడువు పూర్తయిన నేపథ్యంలో గ్రామ కమిటీల నుంచి మండల, నియోజకవర్గ కమిటీల ఎంపికపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీ కమిటీల నియామకాల్లో కొత్త విధానాలను ప్రవేశపెడు తున్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యేలకే పూర్తి ప్రాధా న్యమిస్తూ నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయనుండగా నియోజకవర్గాల నుంచి నేరుగా పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు, వాస్త వాలు తెలుసుకునేందుకు, దిశానిర్దేశం చేసేం దుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షక కమిటీని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ నాయకత్వ వర్గాలు చెబు తున్న వివరాల మేరకు కనీసం ఏడు జిల్లాలకు ఒక పరిశీలకుడిని నియమించనున్నారు. మొత్తంగా కనీసం ఏడుగురు సీనియర్ నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీ పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తుందని చెబుతున్నారు. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు, సరైన మార్గదర్శకత్వం చూపేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. దీంతో జిల్లాలపై పెత్తనమంతా రాష్ట్ర కమిటీదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నియోజకవర్గ కమిటీల్లో 24 మంది?
జిల్లా స్థాయి కమిటీలను రద్దు చేయాలని ప్రాథమికంగా ఇప్పటికే నిర్ణయం తీసు కోవడంతో పార్టీలో ఇక నుంచి నియోజకవర్గ కమిటీలే కీలకం కానున్నాయి. అయితే జిల్లా కమిటీలు రద్దయినా ఆయా జిల్లాలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలను ఇన్‌చార్జిలుగా నియమించనున్నారని, వారు జిల్లాస్థాయి కార్యక్రమాలను సమన్వయం చేస్తారని, అంతకు మించి పెద్దగా వారి పాత్ర ఏమీ ఉండకపోవచ్చని పేర్కొంటు న్నారు. జిల్లాస్థాయి కమిటీల రద్దు నిర్ణయం వల్ల పదవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. అయితే వారందరినీ ఆయా పార్టీ పదవుల్లో సర్దేందుకు నియోజకవర్గ కమిటీలను ఉపయోగించుకోనున్నారు.
ఒక్కో నియోజకవర్గ కమిటీలో 24 మందికి తక్కువ కాకుండా సభ్యులు ఉంటారని, వారి నుంచే నియోజకవర్గ కన్వీనర్లు, ఇతర పదవులకు ఎంపిక చేసుకుంటారని తెలుస్తోంది. పూర్తిగా ఎమ్మెల్యేల కను సన్నల్లో పనిచేసే నియోజకవర్గ కమిటీల్లో ఎంపిక బాధ్యత కూడా వారికే అప్ప జెప్పారు. గ్రామ, పట్టణ, మండలస్థాయి కమిటీలు మాత్రం యథావిధిగా కొనసాగ నున్నాయి. కాగా, నియోజవకర్గస్థాయి కమిటీల్లో ఎందరికి అవకాశం కల్పిస్తారన్న సందేహాలు పార్టీ వర్గాల్లో ఓవైపు నెలకొనగా మరోవైపు రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో సభ్యుల సంఖ్యను తగ్గించే వీలుందని తెలుస్తోంది.