ప్రగతి నివేదన సభకు సై! | TRS Pragathi Nivedana Sabha Date, Venue, Route Map | Sakshi
Sakshi News home page

ప్రగతి నివేదన సభకు సై!

Published Sat, Sep 1 2018 3:18 AM | Last Updated on Sat, Sep 1 2018 11:18 AM

TRS Pragathi Nivedana Sabha Date, Venue, Route Map - Sakshi

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభకు సిద్ధమవుతున్న సభా ప్రాంగణం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గులాబీ జెండాల రెపరెపలు.. స్వాగత తోరణాలు.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించే భారీ కటౌట్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. భారీగా పోలీసు బలగాల మోహరింపుతో ‘ప్రగతి నివేదన సభ’కు కొంగరకలాన్‌ సుందరంగా ముస్తాబైంది. టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభ నిర్వహణలో చిన్న లోటుపాటు కూడా లేకుండా మంత్రులు దగ్గరుండి మరీ ఏర్పా ట్లను పర్యవేక్షిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సభా వేదిక వద్దే శుక్రవారం రాత్రి బస చేశారు. ఉదయం నుంచి అక్కడే మకాం వేసి సభావేదిక, పార్కింగ్‌ ప్రదేశాలు, కార్యకర్తలు కూర్చునే ప్రాంగణం, ఇతర వసతి సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు.

ప్రత్యేక వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌
సభకు 25 లక్షల మంది తరలివస్తారని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల దాహార్తి తీర్చేందుకు సభాస్థలికి సమీపంలో ప్రత్యేక వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నీటి వాల్వూ దగ్గర ఒకేసారి నాలుగు ట్యాంకర్లు, 5 నిమిషా లకో ట్యాంకర్‌ నిండేలా ఫిల్లింగ్‌ స్టేషన్‌ను జల మండలి అందుబాటులోకి తెచ్చింది. శనివారం రాత్రి నుంచే ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ట్రాక్టర్లలో సభా ప్రాంతానికి చేరుకునేవారికి ఈ రాత్రి నుంచే జలాలను పంపిణీ చేయనుంది.

400 మంది వలంటీర్లు
వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్‌ చేసేందుకు వలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ఎంపిక చేసిన 15 పార్కింగ్‌ స్థలాల్లో వాహనదారులకు సూచనలు, సలహాలిచ్చేందుకు 400 మందిని టీఆర్‌ఎస్‌ రంగంలోకి దించింది. ట్రాకర్లపై నేడు సభా ప్రాంతానికి చేరుకునేవారికి ఈ వలంటీర్లు అన్నివిధాలా సాయపడేలా సూచనలు జారీచేసింది. విపత్కర పరిస్థితుల్లో స్పందించేందుకు అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగనుంది. విపత్తులు సంభవిస్తే క్షణాల్లో చేరుకునేందుకు సభా వేదిక, ప్రాంగణం చుట్టూ, పార్కింగ్‌ స్థలాల్లో 30 ఫైర్‌ఇంజన్లను అందుబాటులో ఉంచింది.

వైద్య సేవలకు రెడీ..
ఈ సభకు వచ్చే ప్రజలు అస్వస్థతకు గురైతే తక్షణమే చికిత్స అందించేందుకు 200 మంది వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచింది. ఎంపీలు చామకూర మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌లకు సంబంధించిన ఆస్పత్రుల సిబ్బంది ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేందుకు ముందుకొచ్చారు.

నలువైపులా ఎల్‌ఈడీ తెరలు
సభా ప్రాంగణంలో ఉన్నవారే కాకుండా చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా సభా కార్యక్రమాలను వీక్షించేందుకు నలువైపులా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం, ప్రధాన రహదారులు, పార్కింగ్‌ స్థలాల్లో వీటిని నెలకొల్పారు. 250 ఎల్‌ఈడీ తెరల ద్వారా సభను ఎక్కడ నుంచైనా తిలకించొచ్చు.

20 వేల మంది పోలీసులు
సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, ముఖ్యనేతలు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భావించిన పోలీస్‌ శాఖ భారీగా బలగాలను మోహరించింది. 20 వేల మంది పోలీసులకు గాను శుక్రవారం 15 వేల మంది ప్రగతి నివేదన సభ బందోబస్తు విధుల్లో చేరారు. తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి బస్సుల్లో తరలివచ్చిన బృందాలు సభాస్థలిని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దీనికితోడు నిరంతరం పోలీసు జాగిలాలు గస్తీ కాస్తున్నాయి. 36 డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు సభా ప్రదేశాన్ని జల్లెడ పడుతున్నాయి.


ట్రాక్టర్లలో వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు
ప్రగతి నివేదన సభకు ఊరికో ట్రాక్టర్‌లో తరలిరావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం రాత్రికే 10 వేల ట్రాక్టర్లలో లక్ష మంది వస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారికి విజయవాడ హైవేకు దగ్గరగా, కొంగర నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో, వండర్‌లా సమీపంలో.. ఫ్యాబ్‌సిటీ లోపల మొత్తం 9 ప్రాంతాల్లో బస ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. వారు వండుకునేందుకు వంట చెరుకు, ట్యాంకర్లతో నీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించారు. ఈ పార్కింగ్‌ స్థలాల్లో పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

తొలిసారి బౌన్సర్ల సేవలు
భద్రతకు పోలీసులపైనే ఆధారపడకుండా ప్రైవేటు సెక్యూరిటీని కూడా రంగంలోకి దించుతోంది. 300 మంది బౌన్సర్లను సభాస్థలిలో అందుబాటులో ఉంచుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చే ప్రజలను అదుపు చేసేందుకు వీరి సేవలను వినియోగించుకోవాలని అధికార పార్టీ నిర్ణయించింది. బహిరంగ సభకు వచ్చేవారి కోసం సభాస్థలికి కొద్ది దూరంలో వేదికకు రెండువైపులా సంచార మూత్రశాలలు ఏర్పాటు చేశారు. 300 శౌచాలయాల్లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీటి వసతి ఏర్పాటు చేశారు. మూత్ర శాలల చుట్టూ ప్రహరీ నిర్మించారు.

వేదిక ముందు 16 గ్యాలరీలు
బహిరంగ సభలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. సభకు వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 16 గ్యాలరీలు ఏర్పాటు చేసింది. ఒకదాంట్లో నుంచి ఇంకో గ్యాలరీలోకి వెళ్లకుండా బారికేడ్లు వేసింది. తూర్పున 3, పడమరన 3, ఉత్తరాన 4, దక్షిణాన 4, మీడియా, వీఐపీలకు ఒక్కొక్కటి చొప్పున గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement